జబర్దస్త్
ఈ కామెడీ షో గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ప్రముఖ ఛానెల్ ఈ టీవీలో ప్రసార మయ్యే ఈ షోకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇది భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ప్రజాదరణ పొందిన కార్యక్రమంగా నిలిచింది జబర్దస్త్. ఈ షోను మొదట ఈటీవీలో ఫిబ్రవరి 7, 2013 న ప్రారంభించారు. న్యాయనిర్ణేతలుగా ప్రముఖ తెలుగు సినిమా నటులు నాగేంద్రబాబు, రోజా సెల్వమణిలు వ్యవహరించారు. అలాగే రష్మీ గౌతమ్ ఈ షోకు యాంకర్ గా చేసింది. ఆతర్వాత ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ మరో ప్రోగ్రామ్ కూడా మొదలు పెట్టారు. ఈ షోకు అనసూయ భరద్వాజ్ యాంకర్ గా చేశారు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ షో పుణ్యమా అని ఇండస్ట్రీకి చాలా మంది కమెడియన్స్ దొరికారు. అలాగే సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను లాంటి వారు హీరోలు గా కూడా సినిమాలు చేశారు. అలాగే వేణు, ధనరాజ్ దర్శకులుగా మారి సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే వేణు బలగం సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు.