బెడిసికొట్టిన మాస్టార్ ప్లాన్.. అడ్డంగా బుక్కైన ముగ్గురు దోస్తులు.. ఏం చేశారంటే!
టెక్నాలజీ పెరిగిందని సంతోష పడాలో లేక, దాని వల్ల జరుగుతున్న అనర్థాలను చూసి ఎందుకు ఇలా అవుతుంది అని బాధపడాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం.. చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు అందులో యూట్యూబ్ చూస్తూ ఎన్నో దారుణాలకు ఒడిగడుతున్నారు కొంతమంది. తాజాగా ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. చోరీలు ఎలా చేయాలో యూట్యూబ్లో వీడియోలు చూసి ముగ్గురు యువకుడు ఏటీఏంలో చోరీకి యత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

ఈజీ మనీకి అలవాటు పడిన ముగ్గురు స్నేహితులు బ్యాంకులు, ఏటీఎంలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. చోరీలు ఎలా చేయాలో యూట్యూబ్లో వీడియోలు చూసి నేర్చుకున్నారు. ఈ నెల7న మెదక్ పట్టణంలోని ఆటోనగర్ ఎస్బీఐ బ్యాంకులో దొంగతనానికి యత్నించిన పోలీసులకు అడ్డంగా దొరికి పోయారు. ఈ కేసులో ఆ ముగ్గురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు, పోలీస్ స్టేషన్‌కు తరలించి వారిని విచారించారు. అయితే పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తి మండల పరిధిలోని మానేపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్, లింగం, ప్రసాద్ అనే ముగ్గురు కలిసి గత జూన్ నెలలో గుమ్మడిదల ఎక్స్ రోడ్డులోని HDFC బ్యాంకు ఏటీఎం వద్దకు వెళ్లి ట్రాక్టర్కు తాడు కట్టి దొంగతనం చేయడానికి యత్నించారు.. అక్కడ అలారం మోగడంతో అక్కడి నుంచి పారిపోయారు. మళ్ళీ జూన్ 30వ తేదీన వెల్దుర్తిలోని సెంట్రల్ బ్యాంకు గోడను ధ్వసంచేసి లోనికి ప్రవేశించి, చోరీకి ప్రయత్నించగా.. అక్కడ అలాగే అలారం మోగడంతో అక్కడి నుండి ఈ ముగ్గురు దొంగలు పారిపోయారు.
ఈనెల మొదటి వారంలో గుమ్మడిదలలోని భవానీ వైన్స్ గోడకు రంధ్రం చేసి లోపలికి వెళ్లి మద్యం బ్యాటిళ్ల తోపాటు రూ. 15 వేల నగదును ఎత్తుకెళ్లారు. మళ్ళీ ఈనెల 7న మెదక్ పట్టణంలోని ఆటోనగర్లోని ఎస్బీఐ బ్యాంకులోకి వెళ్లి లాకర్ గోడను పగలగొట్టేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. అదే రోజు కౌడిపల్లి లోని వైన్స్ షాపుకు రంద్రం చేసి మద్యం బాటిళ్లు దొంగతనం చేశారు. దీంతో తాజాగా దొంగతనం కేసులో అరెస్టైన వీరి నుంచి సుత్తి, గడ్డపార, శానాం, తాడు, సంచులు, బైకులు, ట్రాక్టర్, రెండు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు.
కాగా వీరు ఈ దొంగతనాలు చేయడానికి వీరికి యూట్యూబ్ చాలా ఉపయోగపడినట్లు పోలీసుల విచారణలో చెప్పారు.. దొంగతనాలు ఎలా చేయాలో యుట్యూబ్‌లో చూసుకొని ఇలా చేశాం అని పోలీసులు విచారణలో చెప్పారు ఈ ముగ్గురు దొంగలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




