Yadadri Income: యాదాద్రీశుడి ఆలయానికి కార్తీకం సిరుల పంట.. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో ఆదాయం..
Yadagiri Gutta : గతనెల 14న మొదలైన కార్తికం మంగళవారంతో ముగిసింది. కార్తిక మాసం తొలిరోజు నుంచి రోజూ ఆరు సార్లు నిర్వహించిన సామూహిక వ్రతాల్లో 18,824 మంది దంపతులు పాల్గొన్నారు. ఈ పూజలతో రూ.1,64,20,600 సమకూరింది. ఆలయానికి స్వామివారి దర్శనం కోసం సాధారణ రోజుల్లో 10 నుంచి 20 వేల మంది సందర్శించేవారు. సెలవు దినాల్లో 60 నుంచి 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
నల్గొండ, డిసెంబర్13; ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో హుండీ ఆదాయం కూడా పెరిగింది. కార్తిక మాసంలో ఏక శిఖర వాసుడి ఆలయ ఖజానాకు రూ.14.91 కోట్ల ఆదాయం సమకూరింది. యాదాద్రిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. కార్తీకమాసం అందులోనూ ఆదివారం సెలవు దినం కావటంతో.. స్వామి వారిని 70 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్టుగా ఆలయ అధికారులు అంచనా వేశారు. దీంతో ఒక్కరోజులోనే ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరినట్టు పేర్కొన్నారు. ఇందులో సింహభాగం ఆదాయం సమకూరింది.. ప్రసాద విక్రయం, వీఐపీ దర్శనాలదేనని వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణ ప్రజల ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి కార్తిక మాసంలో భక్తులు పోటెత్తారు. శివ, కేశవుల ఆలయాలున్న ఈ క్షేత్రంలో కార్తీక మాసంలో సత్యనారాయణస్వామి సామూహిక వ్రతాలు, దీపోత్సవం, తులసీ ఆరాధనలతో కిక్కిరిసిపోయింది. గతనెల 14న మొదలైన కార్తికం మంగళవారంతో ముగిసింది. కార్తిక మాసం తొలిరోజు నుంచి రోజూ ఆరు సార్లు నిర్వహించిన సామూహిక వ్రతాల్లో 18,824 మంది దంపతులు పాల్గొన్నారు. ఈ పూజలతో రూ.1,64,20,600 సమకూరింది. ఆలయానికి స్వామివారి దర్శనం కోసం సాధారణ రోజుల్లో 10 నుంచి 20 వేల మంది సందర్శించేవారు. సెలవు దినాల్లో 60 నుంచి 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
కార్తీక మాసంలో స్వామివారి దర్శనానికి భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయ ఖజానాకు నిత్యాదాయం అధిక మొత్తంలో సమకూరింది. కార్తీక మాసంలో 37,698 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.3,50,79,660, బ్రేక్, శీఘ్ర దర్శనాలతో రూ.1,69,19,100, కొండపై వాహనాల పార్కింగ్ రుసుం ద్వారా రూ.1,13,50,000 వచ్చాయని ఈవో గీతారెడ్డి తెలిపారు. ఆలయ ఖజానాకు కార్తీక మాసంలో రూ.14.91 కోట్లు సమకూరగా, గత ఏడాదితో పోల్చితే రూ.24.66 లక్షల ఆదాయం పెరిగిందని అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..