Telangana: వేలాది తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేస్తే..! సీసీ టీవీ వీడియో
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో తేనెటీగలు ఒక్కసారిగా గ్రామస్థులపై దాడి చేసి కలకలం రేపాయి. ఈ ఘటనలో సుమారు 15 మంది గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పాఠశాల సమీపంలో జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడం గమనార్హం.

గ్రామస్థులపై తేనెటీగలు విరుచుకుపడ్డాయి.సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో గ్రామస్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో సుమారు 15 మంది గాయపడగా..ఒకరి పరిస్థితి విషమంగా ఉంది..ఈ ప్రమాద దృశ్యాలు సీసీ టీవీ కెమేరాలో రికార్డ్ అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గ్రామంలోని పాఠశాల సమీపంలో ఉన్న మర్రిచెట్టుపై భారీ తేనెపట్టు ఉంది. అయితే, గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఎండ వేడిమికి తాళలేక ఆ తేనెటీగలన్నీ ఒక్కసారిగా చెట్టు కిందికి దిగి వచ్చి గ్రామస్తులపై దాడి చేశాయి. దారి వెంట వెళ్తున్న వారు, ఇళ్ల ముందు ఉన్నవారిపై తేనెటీగలు ముసరుకోవడంతో జనం దిక్కుతోచక పరుగులు తీశారు. ఊహించని ఈ ఘటనలో సుమారు 15 మంది గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారు.. ముఖ్యంగా సుధాకర్ అనే యువకుడిపై తేనెటీగలు ఉధృతంగా దాడి చేయడంతో అతని పరిస్థితి విషమంగా మారింది. బాధితులందరినీ వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సుధాకర్‌తో పాటు మరికొందరిని సంగారెడ్డిలోని బాలాజీ ఆసుపత్రికి తరలించారు. పాఠశాల పక్కనే ఈ ఘటన జరిగినప్పటికీ.. అదృష్టవశాత్తూ తేనెటీగలు స్కూల్ వైపు వెళ్లకపోవడంతో విద్యార్థులకు పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు స్పందించి ఆ తేనెతుట్టెను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
