Team India : ప్రపంచ విజేత టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్..ఛారిటీ మ్యాచ్‌లకు సిద్ధమవుతున్న బీసీసీఐ
Team India : టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన టీమ్ ఇండియా రాబోయే నెలల్లో శ్రీలంక, ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లనుంది. ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత జట్టు శ్రీలంక, ఐర్లాండ్ పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ పర్యటనల్లో అదనపు టీ20 మ్యాచ్‌లు నిర్వహించేలా బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Team India : టీ20 వరల్డ్ కప్ 2026లో తిరుగులేని విజయం సాధించి, మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడిన మన ఆటగాళ్లు, రాబోయే ఏడాది కాలం పాటు మైదానంలో బిజీబిజీగా గడపనున్నారు. తాజా నివేదికల ప్రకారం.. ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత జట్టు శ్రీలంక, ఐర్లాండ్ పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ పర్యటనల్లో అదనపు టీ20 మ్యాచ్‌లు నిర్వహించేలా బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
శ్రీలంక పర్యటనకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. వాస్తవానికి ఈ పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్‌లు (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగం) మాత్రమే జరగాల్సి ఉంది. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు మరో మూడు టీ20 మ్యాచ్‌లను కూడా ఈ షెడ్యూల్‌లో చేర్చేలా చర్చలు జరుగుతున్నాయి. గత ఏడాది శ్రీలంకను వణికించిన భారీ తుపాను, వరదల వల్ల దెబ్బతిన్న బాధితులను ఆదుకోవడానికి నిధుల సేకరణ కోసం ఈ మ్యాచ్‌లను నిర్వహించాలని శ్రీలంక భావిస్తోంది. జూలై-ఆగస్టు మధ్యలో ఈ సిరీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
మరోవైపు, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు టీమిండియా ఐర్లాండ్‌లో కూడా ఒక చిన్న టీ20 సిరీస్ ఆడే అవకాశం ఉంది. జూన్ చివరి వారంలో డబ్లిన్‌లో మూడు టీ20 మ్యాచ్‌లు నిర్వహించే దిశగా క్రికెట్ ఐర్లాండ్, బీసీసీఐ మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. గతంలో 2018, 2022, 2023లో ఐర్లాండ్ పర్యటనలు చేసినప్పుడు భారత జట్టుకు అక్కడ ఘనస్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో మరోసారి అక్కడ మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నారు.
దీనికంటే ముందుగా జూన్ 6 నుంచి 20 వరకు స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఒక చారిత్రక టెస్ట్ మ్యాచ్ (మొహాలీలో), మూడు వన్డే మ్యాచ్‌లు (ధర్మశాల, లక్నో, చెన్నై) జరగనున్నాయి. దీని తర్వాత జూలై 1 నుంచి 19 వరకు ఇంగ్లాండ్‌లో 5 టీ20లు, 3 వన్డేల సిరీస్ ఉండనుంది. మొత్తానికి వరల్డ్ కప్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న భారత అభిమానులకు రాబోయే నెలల్లో అసలైన క్రికెట్ విందు అందబోతోంది.
జూన్ 6 – 20, 2026: ఆఫ్ఘనిస్తాన్
వేదిక: భారత్
మ్యాచ్‌లు: 1 టెస్ట్, 3 వన్డేలు
జూన్ చివరి వారం: ఐర్లాండ్
వేదిక: డబ్లిన్
మ్యాచ్‌లు: 3 టీ20లు (చర్చల్లో ఉంది)
జూలై 1 – 19, 2026: ఇంగ్లాండ్
వేదిక: ఇంగ్లాండ్
మ్యాచ్‌లు: 5 టీ20లు, 3 వన్డేలు
జూలై – ఆగస్టు 2026: శ్రీలంక
వేదిక: శ్రీలంక
మ్యాచ్‌లు: 2 టెస్ట్‌లు, 3 టీ20లు (అంచనా)
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
