Pakistan Cricket :’గోలీ మార్ దో’.. టీమ్ మేనేజ్‌మెంట్‌ను కాల్చి చంపాలి.. మాజీ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
Pakistan Cricket : బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్ ఘోర పరాజయం పొందింది. కేవలం 114 పరుగులకే ఆలౌట్ కావడంతో కోపంతో ఊగిపోయిన మాజీ ఆటగాడు బాసిత్ అలీ, కోచ్‌ను తుపాకీ తో కాల్చి చంపాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Pakistan Cricket :బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు తొలి వన్డేలోనే చుక్కలు కనిపించాయి. మీర్పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా ప్లేయర్ల ధాటికి పాక్ జట్టు కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ ఈ స్వల్ప లక్ష్యాన్ని కేవలం 15 ఓవర్లలోనే ఛేదించి, పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ తీసింది. వరుసగా విఫలమవుతున్న పాక్ జట్టు తీరుపై మాజీ క్రికెటర్లు నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా పాక్ దిగ్గజం బాసిత్ అలీ చేసిన గోలీ మార్ దో(కాల్చి చంపేయండి) అనే వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
పాకిస్థాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ టీమ్ మేనేజ్‌మెంట్‌పై పచ్చి బూతులతో విరుచుకుపడ్డాడు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. “ముందు ఆ వ్యక్తిని కాల్చి చంపేయండి.. పవర్‌ప్లే 10 ఓవర్లలో కనీసం 60 పరుగులు చేయాలని జట్టుకు వ్యూహం రచించిన ఆ మేధావి ఎవరో ముందు తేలాలి. అతనికి గ్రౌండ్ మీద క్రికెట్ ఆడిన అనుభవం లేదు, కేవలం కాగితం మీద లెక్కలు రాసి ఇచ్చేస్తాడు. ఇక్కడి పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నాయో కూడా చూడకుండా ఇలాంటి చెత్త వ్యూహాలు ఎలా ఇస్తారు?” అంటూ హెడ్ కోచ్ మైక్ హెస్సన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో భారత్ వంటి జట్లు కూడా ఇబ్బంది పడ్డాయని, అలాంటి పరిస్థితుల్లో అతిగా ఆడాలని చెప్పడం మూర్ఖత్వమని ఆయన మండిపడ్డారు.
మరోవైపు మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ కూడా పాక్ జట్టు ఆటతీరును దారుణంగా ఎండగట్టారు. అసలు పాకిస్థాన్ ఆడింది ఇంటర్నేషనల్ క్రికెట్టా లేక ఏదైనా లోకల్ క్లబ్ క్రికెట్టా అనే అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు. “నేను ప్రమాణం చేసి చెప్తున్నాను.. క్లబ్ క్రికెట్ ఆడే కుర్రాళ్లు కూడా ఇంత దారుణంగా ఆడరు. బంగ్లాదేశ్ జట్టు ఇంటర్నేషనల్ టీమ్ లా కనిపిస్తే, మనవాళ్లు మాత్రం ప్రాక్టీస్ కోసం వచ్చిన క్లబ్ టీమ్ లా ఉన్నారు” అని అక్మల్ నిప్పులు చెరిగారు. సీనియర్ ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్ వంటి వారు కూడా బాధ్యత లేకుండా ఆడటాన్ని ఆయన తప్పుపట్టారు.
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఒకేసారి నలుగురు కొత్త ఆటగాళ్లను రంగంలోకి దించడంపై కూడా బాసిత్ అలీ అసహనం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదిక అనేది ప్రయోగశాల కాదని, ఒకేసారి నలుగురు డెబ్యూ ఆటగాళ్లను ఆడించడం వల్ల జట్టు సమతూకం దెబ్బతింటుందని ఆయన అన్నారు. ప్రపంచ క్రికెట్‌లో యువకులు వస్తే అద్భుతాలు చేస్తారని, కానీ మనవాళ్లు మాత్రం లోకల్ గ్రౌండ్‌లో ఆడినట్టు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. బంగ్లాదేశ్ బౌలర్ నహిద్ రాణా 5 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించగా, తంజీద్ హసన్ మెరుపు హాఫ్ సెంచరీతో బంగ్లాకు అద్భుత విజయాన్ని అందించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
