Telangana: ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే IASల సతీమణులు ప్రసవం.. మారుతోన్న నయా ట్రెండ్!
ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెరుగుతోందని మరోసారి స్పష్టమైంది. రాష్ట్రానికి చెందిన పలువురు ఐఏఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రులనే ఎంచుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నిపుణులైన వైద్యులు, ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని..

హైదరాబాద్, డిసెంబర్ 24: తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెరుగుతోందని మరోసారి స్పష్టమైంది. రాష్ట్రానికి చెందిన పలువురు ఐఏఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రులనే ఎంచుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నిపుణులైన వైద్యులు, ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్యదర్శి వీపీ గౌతమ్ భార్య గాంధీ ఆసుపత్రిలో ప్రసవం చేశారు. హైరిస్క్ గర్భధారణ కావడంతో ప్రత్యేక వైద్య పర్యవేక్షణ అవసరమైందని వైద్యులు తెలిపారు. సోమవారం ఉదయం 9.40 గంటలకు ఆమె శిశువుకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి ఐసీయూలో చికిత్స పొందుతుంది. త్వరలోనే సాధారణ వార్డుకు మార్చనున్నారు.
ఇదే తరహాలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తన భార్య ప్రసవాన్ని గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేయించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కూడా మాతృ సంరక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రినే ఎంపిక చేసుకున్నారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (FESS), సెప్టోప్లాస్టీ వంటి శస్త్రచికిత్సలు చేయించుకున్నట్లు సమాచారం. గాంధీ ఆసుపత్రిలో మాతా–శిశు సంరక్షణ బ్లాక్‌లో గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్తీషియా, రేడియాలజీ, యూరాలజీ, కార్డియోథొరాసిక్ విభాగాల్లో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండటమే తమ నిర్ణయానికి కారణమని గౌతమ్ తెలిపారు. క్లిష్టమైన కేసేమైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం లభిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఈ పరిణామాలు తెలంగాణ ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల్లోనే కాకుండా, ఉన్నతాధికారుల్లోనూ విశ్వాసం పెరుగుతోందని సూచిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల సేవల నాణ్యత మెరుగుపడితే మరింత మంది ప్రజలు వీటిని ఆశ్రయించే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




