AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సర్కార్ దవాఖానాల్లో కొత్త రూల్స్.. వైద్యశాఖ కీలక నిర్ణయం.. ఉల్లంఘిస్తే..

ప్రభుత్వాసుపత్రులను సురక్షితమైన, పరిశుభ్రమైన హీలింగ్ జోన్‌లుగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ విధానాన్ని అమలు చేస్తూ, ఎలుకల సమస్యను పరిష్కరించేందుకు కఠిన నిబంధనలు ప్రవేశపెట్టింది. వార్డులలో ఆహారం తినడాన్ని నిషేధించింది. పగుళ్లను మూసివేస్తూ, చెత్తను తరలిస్తూ ప్రజల సహకారాన్ని కోరుతోంది.

Telangana: సర్కార్ దవాఖానాల్లో కొత్త రూల్స్.. వైద్యశాఖ కీలక నిర్ణయం.. ఉల్లంఘిస్తే..
Telangana Govt Hospitals
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Dec 24, 2025 | 6:21 PM

Share

తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులను కేవలం చికిత్సా కేంద్రాలుగానే కాకుండా, రోగులకు పూర్తి సురక్షితమైన, ఆరోగ్యకరమైన హీలింగ్ జోన్లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఆసుపత్రుల్లో పారిశుధ్యం, భద్రత ప్రమాణాలను పెంచేందుకు సరికొత్త సంస్కరణలు అమలు చేస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరేంద్ర కుమార్ వెల్లడించారు. ఆసుపత్రిలో పారిశుధ్యం, భద్రత కోసం ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు.

ఇటీవల కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకల సమస్య వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. దీనిపై డీఎంఈ స్పందిస్తూ.. ఆసుపత్రి సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ, రోగుల బంధువులు వార్డుల్లోనే ఆహారం తినడం, మిగిలిపోయిన పదార్థాలను అక్కడే పారవేయడం వల్ల ఎలుకల బెడద పెరుగుతోందని విశ్లేషించారు. ఈ సమస్యను రూపుమాపేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ఆస్పత్రి భవనాల్లోని పగుళ్లు, రంధ్రాలను సిమెంట్‌తో శాశ్వతంగా మూసివేస్తున్నామని తెలిపారు. అత్యంత కీలకమైన ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు, లేబర్ రూమ్లలో జీరో గ్యాప్ సీలింగ్ విధానాన్ని పాటిస్తూ పూర్తి స్టెరిలైజేషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కిటికీలు, వెంటిలేటర్లు, డ్రైనేజీ వంటి పనిలన్నిటినీ వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ముఖ్యంగా వార్డుల్లో పేషెంట్ అటెండర్లు భోజనం చేయడంపై కఠిన నిషేధం విధిస్తున్నామని.. దీనికి ప్రజలు సహకరించాలని నరేంద్ర కుమార్ విజ్ఞప్తి చేశారు. పేషెంట్ సహాయకులు క్యాంటీన్లలో మాత్రమే ఆహారం తీసుకోవాలని ఆయన గుర్తు చేశారు. ఆసుపత్రి అంతట చెత్త డబ్బాలను వినియోగిస్తున్నామని.. నిలువ ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు తరలిస్తున్నామని డీఎంఈ తెలిపారు. ఈ వ్యవస్థను మానిటరింగ్ చేసేందుకు సూపర్వైజర్లను వైద్యశాఖ నియమించింది. మైకుల ద్వారా ప్రచారం, సైన్ బోర్డుల ద్వారా పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

ప్రభుత్వాసుపత్రులను పరిశుభ్రంగా ఉంచడం కేవలం అధికారుల బాధ్యతే కాదు, అది ప్రజల సామాజిక బాధ్యత కూడా. పేషంట్ల వెంట వార్డులో ఎక్కువ మంది ఉండడం అక్కడే భోజనం చేయడం పేషెంట్‌కు మంచిది కాదు. మిగిలిన ఆహారాన్ని ఎక్కడపడితే అక్కడ వదిలేయడం వల్ల కీటకాలు ఎలకల సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ఆస్పత్రి నిబంధనలు పాటించి యంత్రంగానికి సహకరించాలని ప్రజలకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..