Telangana: నల్గొండలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగకు ఏర్పాట్లు.. పోలీసుల అనుమతి వచ్చేనా?
BRS Public Meeting: మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండలో అడుగు పెడితే ప్రజలే అడ్డుకుంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే వ్యాఖ్యానించారు. సభ నిర్వహించి తీరతామని కృష్ణా బేసిన్‌లో తెలంగాణ హక్కులు కాపాడడం కోసం ఎంతవరకైనా పోరాడతామని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తేల్చి చెప్పారు. దీంతో నల్లగొండ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు మేడారం జాతర, ఇతర పరిస్థితుల దృష్ట్యా ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం సభలు, సమావేశాలకు కేటాయించొద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
BRS Public Meeting: కృష్ణా జలాల జగడం ముదురుతోంది. కృష్ణా జలాల పంపిణీ, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ కాక పెంచుతోంది. నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. కృష్ణా జలాల పరిరక్షణ ధ్యేయంగా బీఆర్ఎస్ ఈ నెల 13న నల్లగొండలో భారీ బహిరంగ సభకు సమాయత్తమవుతోంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జలాల అంశాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. దీంతో ఈ సభ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ సభకు పోలీసులు అనుమతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కృష్ణానది జలాల్లో హక్కుల సాధనే ప్రధాన ఎజెండా..
కేఆర్‌ఎంబీకి కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించడంలో మీరంటే.. మీరే కారణమంటూ అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ అంశంపై ఇప్పటికే నల్లగొండకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగదీశ్‌రెడ్డితోపాటు సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కృష్ణానది జలాల పరిరక్షణ సభ పేరుతో ఈనెల 13న నల్లగొండలో బీఆర్‌ఎస్ నిర్వహించాలని నిర్ణయించింది. మూడు లక్షల మందితో సభను నిర్వహించేందుకు నియోజకవర్గాల వారీగా ఇన్ ఛార్జులను కూడా బీఆర్ఎస్ నియమించింది. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులు సాధించడమే ఈ సభ ప్రధాన ఎజెండా అనే బీఆర్ఎస్ చెబుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని ఆరోపించింది. భవిష్యత్తులో ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా.. ప్రాజెక్ట్ నుంచి చుక్క నీరు తీసుకోవాలన్న వారి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని బీఆర్ఎస్ చెబుతోంది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించింది. కేఆర్‌ఎంబీ పరిధిలోకి నాగార్జునసాగర్ ప్రాజెక్టు వెళ్లకుండా నిరోధించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
బీఆర్ఎస్ సభకు పోలీసుల అనుమతి ఇచ్చేనా..?
కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ బీఆర్ఎస్ యుద్ధానికి సిద్ధమైంది. ప్రధానంగా కృష్ణా జలాల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నల్లగొండలో 13న నిర్వహించే కేసీఆర్ సభకు పోలీసుల అనుమతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సభకు అనుమతిస్తారా..? లేదా..? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జిల్లాలో ముందస్తు అనుమతి లేకుండా నెలరోజుల వరకు ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు, బహిరంగ సభలు నిర్వహించడానికి వీల్లేదని 30, 30ఏ పోలీసు యాక్టు అమలు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ ప్రకటన చేశారు. బీఆర్ఎస్ సభ కు సిద్ధమవుతున్నారని ముందే తెలిసి పోలీసు యాక్ట్ అమలు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండలో అడుగు పెడితే ప్రజలే అడ్డుకుంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే వ్యాఖ్యానించారు. సభ నిర్వహించి తీరతామని కృష్ణా బేసిన్‌లో తెలంగాణ హక్కులు కాపాడడం కోసం ఎంతవరకైనా పోరాడతామని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తేల్చి చెప్పారు. దీంతో నల్లగొండ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు మేడారం జాతర, ఇతర పరిస్థితుల దృష్ట్యా ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం సభలు, సమావేశాలకు కేటాయించొద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..