Gangula Kamalakar: ప్రభుత్వానికి సహకరిస్తా.. సోదాల్లో ఎంత నగదు దొరికిందో చెప్పాలి: మంత్రి గంగుల

విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన మంత్రి గంగుల కమలాకర్ బుధవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. దర్యాప్తు సంపూర్ణంగా చేయాలంటూ కోరారు. నిజాలు నిగ్గుతేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదేనంటూ మంత్రి గంగుల స్పష్టంచేశారు.

Gangula Kamalakar: ప్రభుత్వానికి సహకరిస్తా.. సోదాల్లో ఎంత నగదు దొరికిందో చెప్పాలి: మంత్రి గంగుల
Gangula Kamalakar
Follow us

|

Updated on: Nov 10, 2022 | 2:30 AM

తెలంగాణలో ఈడీ దాడులు కలకలం రేపాయి. మంత్రి గంగుల కమలాకర్‌ తోపాటు ఆయన బంధువులు, గ్రానైట్ వ్యాపారుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో విస్తృత సోదాలు జరిగాయి. హైదరాబాద్‌, కరీంనగర్‌లో ఏకకాలంలో 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తానంటూ మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన మంత్రి గంగుల కమలాకర్ బుధవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. దర్యాప్తు సంపూర్ణంగా చేయాలంటూ కోరారు. నిజాలు నిగ్గుతేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదేనంటూ మంత్రి గంగుల స్పష్టంచేశారు. తాను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఈడీ అధికారులు వీడియో కాల్‌ చేశారని.. ఇంటి తాళాలు తీయమని అడిగారని తెలిపారు. ఈ క్రమంలో ఇంట్లోని ప్రతి లాకర్‌ ఓపెన్‌ చేసి చూసుకొమని చెప్పానంటూ వెల్లడించారు. ఈ సోదాల్లో ఎంత నగదు దొరికిందో, ఏమేం స్వాధీనం చేసుకున్నారో ఈడీ అధికారులు లెక్క చెప్పాలంటూ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. మైనింగ్‌, రాయల్టీకి సంబంధించిన అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయంటూ పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి హవాలా ద్వారా నగదు తెచ్చామా..? లేదా..? అనేది ఈడీ, నగదు అక్రమంగా నిల్వ ఉంచామా..? లేదా అనేదీ ఐటీ శాఖ చూస్తుందన్నారు. వీటికి సంబంధించి తమ సంస్థల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదంటూ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. పారదర్శకంగా ప్రభుత్వ అనుమతులతో వ్యాపారం నిర్వహిస్తున్నామని.. ఈసమయంలో దగ్గరుండి దర్యాప్తునకు సహకరించాలనే ఉద్దేశ్యంతో వచ్చినట్లు తెలిపారు.

కాగా.. బుధవారం ఈడీ హైదరాబాద్ సోమాజీగూడ, అత్తాపూర్‌లోనూ గ్రానైట్‌ వ్యాపారుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. కరీంనగర్‌లోని మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో నాలుగు గంటలకు పైగా సోదాలు చేశారు. ఇంటి తాళాలు పగులగొట్టి తనిఖీలు జరిపారు. మొత్తం 9 గ్రానైట్‌ కంపెనీల్లో సోదాలు నిర్వహించారు. శ్వేత ఏజెన్సీస్‌, ఏఎస్‌ షిప్పింగ్‌, మైథాలీ ఆధిత్య ట్రాన్స్‌పోర్టు, కేవీకే ఎనర్జీ, అరవిందా గ్రానైట్స్‌ సహా పలు సంస్థలో సోదాలు చేశారు.

2011-13 మధ్య కాలంలో గ్రానైట్‌ అక్రమాల కారణంగా ప్రభుత్వానికి 750కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు ఫిర్యాదులందాయి. గ్రానైట్ అక్రమాలపై కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడేళ్లుగా ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రానికి కూడా లేఖ రాశారు. అందులో భాగంగానే దాడులు జరిగాయన్న టాక్ వినిపిస్తోంది. క్వారీ నిర్వాహకులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న ఫిర్యాదుతోనే సోదాలు జరిపినట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..