AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tarun Chugh: ప్రధాని మోడీ పర్యటనలో సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.. బీజేపీ నేత తరుణ్‌ చుగ్‌..

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమంలోనూ కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉందని తరుణ్ చుగ్ తెలిపారు. తెలంగాణలో రోజురోజుకు ప్రాబల్యాన్ని కోల్పోతున్న కేసీఆర్ నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారంటూ విమర్శించారు.

Tarun Chugh: ప్రధాని మోడీ పర్యటనలో సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.. బీజేపీ నేత తరుణ్‌ చుగ్‌..
Tarun Chugh
Shaik Madar Saheb
|

Updated on: Nov 10, 2022 | 5:28 AM

Share

గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల మూతపడిన ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి జాతికి అంకితమిచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 12న రామగుండం వస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోడీ రామగుండం పర్యటనలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, తన కొత్త మిత్రులు సీపీఐ, సీపీఎంలతో కలిసి సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తరుణ్ చుగ్ ఆరోపించారు. ఎరువుల ఫ్యాక్టరీ తెరవడాన్ని కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. ఈ కర్మాగారం వల్ల తెలంగాణ రైతులకే కాకుండా యావత్ దేశానికి విశేష ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ మేరకు తరుణ్ చుగ్ బుధవారం ప్రకటన విడుదల చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీపై కేసీఆర్ మరోసారి అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కేసీఆర్ ఎన్ని అబద్ధాలు చెప్పినా విజ్ఞత గల తెలంగాణ ప్రజలు నమ్మబోరన్నారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఈ ఫ్యాక్టరీ మూతపడిన విషయం ఆయన గుర్తించాలన్నారు. ఫ్యాక్టరీని తెరిపించేందుకు ఆయన కానీ, ఆయన మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన ప్రభుత్వం కానీ ఏమీ చేయలేదన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకుని రూ. 6,500 కోట్లతో ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తున్నారని తరుణ్ చుగ్ తెలిపారు. తెలంగాణకు కేంద్రప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కేసీఆర్ అంటున్నారు.. 2014లో తెలంగాణ ఏర్పడే సమయానికి, రాష్ట్రంలో జాతీయ రహదారుల మొత్తం నిడివి 2,511 కి.మీ.లు. ఇప్పుడు 4,996 కి.మీ.లకు పెరిగిందని తెలిపారు. 2014-2022 కాలంలో కొత్తగా 2,485 కి.మీ.లు జాతీయ రహదారులు నిర్మించారన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిడివిలో 99 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. ఇంకా హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తూ అంబర్‌పేట్ వద్ద రూ.186.71 కోట్లతో 4-లేన్ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తోందన్నారు. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు రూ.628.8 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మిస్తోందని తెలిపారు.

రైల్వేల్లోనూ తెలంగాణకు కేంద్రం కేటాయింపులు భారీగా పెరిగాయని తరుణ్ చుగ్ తెలిపారు. 2014-19లో ప్రతి సంవత్సరం సగటున రూ.1,110 కోట్ల కేటాయింపులు జరిగేవి. రూ.4,200 కోట్లతో కేంద్రం పలు అభివృద్ధి పనులు చేపట్టినా రాష్ట్రం తన వాటాగా ఇవ్వాల్సిన రూ.699 కోట్లు చెల్లించడం లేదని తెలిపారు. 2014-21 కాలంలో రాష్ట్రంలో 177 కిలోమీటర్ల పొడవు మేర రైల్వే లైన్లు నిర్మాణమయ్యాయన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో రూ.31,281 కోట్ల విలువ గల పలు ప్రాజెక్టులను రైల్వేశాఖ చేపట్టిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమంలోనూ కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉందని తరుణ్ చుగ్ తెలిపారు. తెలంగాణలో రోజురోజుకు ప్రాబల్యాన్ని కోల్పోతున్న కేసీఆర్ నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారంటూ విమర్శించారు. మునుగోడులో ఆశించిన భారీ మెజారిటీ దక్కకపోవడంతో, రానున్న ఎన్నికల్లో ఓటమి ఖాయమవడంతో కేసీఆర్ ఆందోళనలో కూరుకుపోయారంటూ తెలిపారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్న కాలంలో రాష్టానికి వచ్చిన నిధులు, 2014 తర్వాత వచ్చిన నిధులపై బహిరంగ చర్చకు రావాలంటూ తరుణ్ చుగ్ సవాలు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..