హస్తినలో మళ్లీ చక్రం తిప్పేది తెలుగువారేనా..? కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

ఇప్పుడు భారత యవనికపై మరో కొత్త ఫ్రంట్ రానుంది. నానాజాతి సమితిలా అంతా ఫ్రంట్ కట్టే ఆలోచన సాగుతోంది. అయితే అది అసలు ఎంత వరకు జట్టు కడుతుంది..

హస్తినలో మళ్లీ చక్రం తిప్పేది తెలుగువారేనా..? కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?
Kcr, Uddhav, Pawar
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 22, 2022 | 4:24 PM

రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం అంటూ ఉండదు. శత్రువులు మిత్రులుగా మారవచ్చు. మిత్రులు శత్రువులుగా దూరం కావొచ్చు. వారంతా జట్టు కట్టి ప్రత్యర్థులకు చుక్కలు చూపించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు భారత యవనికపై మరో కొత్త ఫ్రంట్ రానుంది. నానాజాతి సమితిలా అంతా ఫ్రంట్ కట్టే ఆలోచన సాగుతోంది. అయితే అది అసలు ఎంత వరకు జట్టు కడుతుంది. దాని మనుగడ ఎలా ఉంటుంది. ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఈ కొత్త ఫ్రంట్ కు నాయకత్వం వహించనుంది ఎవరు..ఏంటనేది మార్చి 3న వారణాసిలో జరిగే ర్యాలీ తర్వాత తేలనుంది. తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారణాసిలో జరిగే ఈ ర్యాలీకి బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఆహ్వానిస్తున్నారు సిఎం మమతా బెనర్జీ. ఆ మీటింగ్ తర్వాతనే కొత్త కూటమి పై క్లారిటీ రానుంది. ఈ ర్యాలీకి వచ్చే వారెవరు.. దూరంగా ఉండేదెవరు..రాకపోయినా మద్దతు పలికేదెవరు అనేది చర్చనీయాంశమైంది.

మళ్లీ తెలుగువారేనా..

జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర మూములుది కాదు. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబునాయుడులు వివిధ ఫ్రంట్ లకు నాయకత్వం వహించారు. ఇప్పుడు తెలంగాణ సిఎం కేసీఆర్ నాయకత్వం వహించే ఛాన్స్ ఉంది. అయితే ఈ కూటమిలో కాంగ్రెస్ ఉండకూడదని కేసీఆర్ ప్రతిపాదన పెట్టడం హాట్ టాపికైంది. మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లను కలిసి ఇదే ప్రతిపాదన తెచ్చారు కేసీఆర్. కాంగ్రెస్ టెంట్ లేకుండా జాతీయ ప్రంట్ సాధ్యమేనా అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అంటున్న మాట. గతంలో మమతా బెనర్జీ ఇదే ప్రతిపాదన తెచ్చినా కాదంది శివసేన. శివసేన, డిఎంకే, ఆర్జేడీలు కాంగ్రెస్ తోనే కలిసి ఉన్నాయి. ఆ పార్టీలు లేకుండా కొత్త ప్రంట్ నిలుస్తుందా అనేది అనుమానమే.

బంగారు భారతం…

బంగారు తెలంగాణను ఎలా తయారు చేసుకున్నామో..బంగారు భారతదేశాన్ని తయారు చేస్తానంటున్నారు కేసీఆర్. అమెరికా లాంటి దేశాలు భారత్ కు వచ్చేలా చూద్దామంటున్నారు గులాబీ బాస్. దేశంలోని ప్రాంతీయ శక్తులన్నింటినీ కలిపి బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తామంటోంది టీఆర్ఎస్. అయితే తుక్కుడే గ్యాంగ్ తో కలిసి పనిచేసి కేసీఆర్ ఏం సాధించలేరు. దేశ ఐక్యతకు భంగం కలిగించడం మినహా అంటున్నారు బీజేపీ నేతలు. కేసీఆర్ పని తీరు మాకు బాగా నచ్చింది. తెలంగాణలో రైతు బంధు పై మహారాష్ట్ర సర్కార్ ఆసక్తి చూపిస్తుంది. రైతు బంధు పెట్టాలని తెలంగాణ సరిహద్దు ఉన్న మహారాష్ట్ర ప్రాంత రైతులు మమ్ములను ఇబ్బంది పెడుతున్నారని ఉద్దవ్ థాక్రే చెబుతున్న తీరు చర్చనీయాంశమైంది. కానీ అదే సమయంలో యాంటీ నేషనల్ గా ముద్ర పడ్డ నటుడు ప్రకాష్ రాజ్ వంటి వారిని కేసీఆర్ తనతో తీసుకెళ్లడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి. కేసీఆర్ నాయకత్వాన్ని మమతా, స్టాలిన్, శరద్‌ పవార్‌, ఉద్దావ్‌ థాక్రే, లెప్ట్ పార్టీలు స్వాగతిస్తున్నాయి. కానీ కలివిడిగా విడి విడిగా ఉండే ఈ పార్టీలు చివరి వరకు సహకరిస్తాయా. ఎంత వరకు నిలబడతాయనేది సందేహస్పదమే. దేశంలో బీజేపీ కూటమి లేకపోతే కాంగ్రెస్ కూటమి ఈ రెండే ఉన్నాయి. ఈ నేపధ్యంలో గతంలో వచ్చిన కూటములను ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం.

జనతా కూటమి (1977)..

1977 జనతా పార్టీ ఆధ్వర్యంలో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో కూటమి ఏర్పాటైంది. పేరు పెట్టని కూటమిని జనతా ఫ్రంట్ అని పిలిచేవాళ్లు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి మొరార్జీదేశాయ్ ను ప్రధానిని చేసింది. కూటమిలో లుకలుకలు రావడంతో మధ్యలోనే కూటమి విచ్చిన్నమైంది. కాంగ్రెస్ ప్రొద్భలమే ఇందుకు కారణమే వాదనలేకపోలేదు.

నేషనల్ ఫ్రంట్ (1989–1991)..

జనతాదళ్ నేతృత్వంలో రాజకీయ పార్టీల సంకీర్ణ కూటమి ఏర్పడింది. 1998, 1990 మధ్యకాలంలో N. T. రామారావు నాయకత్వంలో జాతీయ ఫ్రంట్ అధ్యక్షుడి ఉండగా, V. P. సింగ్ కన్వీనర్‌గా కొనసాగారు. సంకీర్ణ ప్రధానమంత్రిగా తొలిగా V. P. సింగ్ ఆ తర్వాత చంద్ర శేఖర్ అధికారంలోకి కొనసాగారు. అప్పుడు జనతాదళ్, టీడీపీ, టిడిఎంకే, అసోం గణ పరిషత్, ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) వంటి పార్టీలున్నాయి. వీరికి బయటి నుంచి లెఫ్ట్ ఫ్రంట్ మద్దతు పలికింది. 1991లో జార్ఖండ్ ముక్తి మోర్చా ఫ్రంట్‌లో భాగమైంది. 1995లో టీడీపీ చీలి ఒక వర్గం ఎన్.టి.రామారావుతో మరో వర్గం చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చూపింది. 1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫ్రంట్ కూలిపోయింది. 1996లో ఎన్టీఆర్ చనిపోయాక వామపక్షాలు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోగా…జనతాదళ్ లక్ష్మీపార్వతికి అండగా నిలిచింది.

యునైటెడ్ ఫ్రంట్ (1996–1998)..

1996లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 161 సీట్లు వచ్చాయి. ఫలితంగా వాజ్‌పేయి ప్రధానమంత్రి అయ్యారు. 13 రోజుల తరువాత మెజార్టీ నిరూపించుకోలేక ఆ ప్రభుత్వం పడిపోయింది. కాంగ్రెస్ కు 140 సీట్లున్నా ఫ్రంట్ కు నాయకత్వం వహించడానికి నిరాకరించింది. కాంగ్రెస్, సీపీఎం మద్దతుతో వీపీ సింగ్, జ్యోతిబసు, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, జీకే మూపనార్, కరుణానిధిలకు అవకాశం వచ్చినా వినియోగించుకోలేదు. జనతాదళ్, ఎస్పీ, డిఎంకే, టీడీపీ, అసోం గణపరిషత్, ఆల్ ఇండియా ఇందిరా కాంగ్రెస్ (తివారీ), లెఫ్ట్ ఫ్రంట్ (4 పార్టీలు), తమిళ్ మానిలా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది. 1996- 1998 మధ్య రెండు సార్లు ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.

తొలిగా ప్రధానిగా జనతాదళ్ నుండి H. D. దేవెగౌడ, ఆ తర్వాత I. K. గుజ్రాల్ లు పని చేసారు. ఆ తర్వాత జ్యోతిబసుకు వచ్చిన అవకాశం వినియోగించుకోలేదు. V. P. సింగ్ కు రెండోసారి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా అదే కాదనే మాట వచ్చింది. సీతారాం కేసరి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ నుంచి వారికి మద్దతు లభించింది. అప్పుడు చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా పనిచేశారు. దేవెగౌడను ప్రధానిగా ఉన్న సమయంలో సంకీర్ణం-కాంగ్రెస్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా దేవెగౌడ సర్కార్ పతనమైంది. ఆ తర్వాత I. K. గుజ్రాల్ ప్రధానిగా వచ్చినా చివరకు పతనమైంది. యునైటెడ్ ఫ్రంట్ అధికారాన్ని కోల్పోయింది.

జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)..

1998లో అటల్ బిహారి వాజపేయి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఏర్పడింది. 2014 లోక్ సభ సాధారణ ఎన్నికల్లో 38.5శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చింది. బీజేపితో సహా సమతా పార్టీ, AIADMK పార్టీలు జట్టు కట్టాయి. బీజేపీతో పాటు అకాళీదల్‌, అప్నాదల్‌, JDU, AIDMK రిపబ్లికన్ పార్టీలు ఈ టీమ్ సభ్యులు. 2019లో శివసేన బయటకు వెళ్లి కాంగ్రెస్ తో జట్టు కట్టింది. మహారాష్ట్రలో ఇప్పుడు కాంగ్రెస్, శివసేనలు అధికారంలో ఉన్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో 14 పార్టీలుండగా..333 మంది ఎంపీలు ఆ కూటమికి ఉండటం విశేషం.

యునైటెడ్ ప్రొగ్రెసివ్‌ అలయెన్స్(యూపీఏ)

యూపీఏ పేరుతో భారత్ లో మరో కూటమి ఏర్పడగా 18 పార్టీలు జట్టు కట్టాయి. ఆ కూటమికి లోక్ సభలో 91 మంది, రాజ్యసభలోను 57 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్‌, TMC, DMK, NCP, శివసేన, RJD, సమాజ్‌వాది, JMM, నేషనల్ కాన్ఫరెన్స్, IUML, RSP, కేరళ కాంగ్రెస్, LJD, JDS లు ఈ కూటమిలో ఉన్నాయి. సోనియాగాంధీ ఈ కూటమికి నేతృత్వం వహిస్తుండగా..లెప్ట్ పార్టీల మద్దతు ఉంది.

ఫెడరల్ ఫ్రంట్‌ యత్నాలు (2019)

వెస్ట్ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ నేతృత్వంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలు జరిగాయి. 2019 జనవరిలో కోల్‌కతాలో టీఎంసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిపింది. ఇందులో 22 పార్టీల నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు, కేజ్రీవాల్‌, శరద్‌పవార్‌, అఖిలేష్‌ యాదవ్‌, స్టాలిన్‌, ఖర్గే వంటి నేతలు హాజరైన ఈ సమావేశానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లలేదు. కాంగ్రెస్‌ పార్టీని కలుపుకుపోవడంలో విబేధించి కేసీఆర్‌ వెళ్లలేదు. కానీ ఈ సారి కేసీఆర్ ఈ సారి వెళ్లే అవకాశముంది.

తటస్ధ పార్టీలు..

దేశంలో ఇప్పుడు కొన్ని పార్టీలు అటు ఎన్జీఏ, ఇటు యూపీలో భాగస్వామ్యం కాలేదు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్, విపక్ష టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, యూపీలో బిఎస్పీ, అలానే ఎంఐఎం, బీజేడీ, ఆప్ లు ఎవరి వైపు మొగ్గు చూపలేదు.

కేసీఆర్ ఏం చేస్తున్నారంటే..

తెలంగాణ సిఎం కేసీఆర్ దూకుడు పెంచారు. తెగిస్తే పోయేదేముంది అనే తరహాలో వెళుతున్న తీరు గమిస్తున్నాయి మిగతా పక్షాలు. అసలు ఈ మధ్య కాలంలో కేసీఆర్ ఏం చేశారో చూద్దాం.

14-డిసెంబర్‌ 2021- స్టాలిన్‌తో మంత్రాంగం 08 -జనవరి 2022- లెఫ్ట్‌ పార్టీ నేతలకు ఆతిథ్యం 11- జనవరి 2022 – RJD తేజస్వీయాదవ్ తో భేటి 14-ఫిబ్రవరి 2022 – మమత బెనర్జీ నుంచి ఫోన్ కాల్‌ 20- ఫిబ్రవరి 2022- శరద్‌ పవార్‌, ఉద్దావ్‌ థాక్రేతో భేటి 03- మార్చి 2022న మమతా నిర్వహించే వారణాసి ర్యాలీకి హాజరయ్యే వీలు

వాళ్లు ఏంటి….

ప్రధాని నరేంద్ర మోదీకి సరిజోడు ఎవరు అనే అంశం పై పార్టీల్లో అస్పష్టత ఉంది. ఎవరు నాయకత్వం వహిస్తారనే విషయం పై భిన్నాభిప్రాయాలున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్‌ లేని ఫ్రంట్ సాధ్యాసాధ్యాల పై చర్చ సాగుతోంది. మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో కలిసి అధికారంలో ఉంది శివసేన.

తమిళనాడులో కాంగ్రెస్‌తో DMK పొత్తు పెట్టుకుంది. ఇప్పటికీ బీహార్‌లో కాంగ్రెస్‌తోనే ఉంది RJD. మరోవైపు లెఫ్ట్ పార్టీలను TMC సహిస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. గతంలో పుట్టిన ఫ్రంట్ లన్నీ తెరమరుగు కాగా…ఇప్పుడు కొత్తగా రానున్న ఫ్రంట్ భవితవ్యం తేలాలంటే మార్చి3 వరకు ఆగాల్సిందే.

-కొండవీటి శివనాగరాజు, సీనియర్ జర్నలిస్టు, రీసెర్స్ విభాగం, టీవీ9 తెలుగు

Also Read..

Sonu Sood: సోనూసూద్ పై కేసు.. నిబంధనలు ఉల్లంఘించినట్లు అభియోగం.. అసలేం జరిగిందంటే..

Uttar Pradesh Assembly Election 2022: ఉత్తరప్రదేశ్‌లో రేపు జరిగే నాలుగో దశ పోలింగ్‌పైనే అందరి దృష్టి..