Tips to Live Happier Life: నవ్వుల పువ్వులు మీ జీవితంలో వికసించాలంటే.. ఆనంద మార్గం ఇదే!

అనుకుంటాం గానీ.. ఆనందంగా ఉండటం కూడా ఒక కళ. ఇది అందరికీ సాధ్యం కాదు. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు.. కొందరికీ సుఖసౌఖ్యాలు అనుభవించడానికి చుట్టూ అన్నీ ఉంటాయి. కానీ అవేవీ ఆనందాన్ని ఇవ్వవు. దీంతో మనసంతా చీకటి కమ్మి విషాదంలో మునిగిపోతుంటారు. వీటి నుంచి బయటపడాలంటే ఈ కింది ఆనందమార్గాలు దారి చూపుతాయి.. ఎందుకు ఆలస్యం మీరు ఇందులో పయనించండి..

Tips to Live Happier Life: నవ్వుల పువ్వులు మీ జీవితంలో వికసించాలంటే.. ఆనంద మార్గం ఇదే!
Live Happier In Life
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 07, 2025 | 3:42 PM

ప్రతి ఒక్కరినీ గతం వేధిస్తుంది. భవిష్యత్తు భయపెడుతుంది. ఆ రెండింటి మధ్యా చిక్కుకుని వర్తమానాన్ని నిర్లక్ష్యం చేయడం సగటు మనిషి వీక్‌నెస్‌. అందుకే ఈ క్షణం విలువ తెలుసుకుని, ఈ నిమిషాన్ని ఆస్వాదించమని జీవితాన్ని చదివేసిన మహానుభావులు చెబుతుంటారు. ఇంతకంటే మంచి రోజులు వస్తే రావచ్చునుగానీ గడిచిపోయిన క్షణం మాత్రం తిరిగిరాదు. అందుకే ప్రతి రోజూ, ప్రతి నిమిషం విలువైందే. అయితే ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు. కొందరు సంతోషంగా ఉండేందుకు అధిక డబ్బు సంపాదిస్తే.. మరికొందరు ఆ డబ్బు ఖర్చు చేసి కొత్త బట్టలు, వస్తువులు కొనుక్కుని అందులోనే ఆనందాన్ని పొందుతారు. ఆరందాన్ని అనుభవించకుండా ఇతరులను చూస్తూ బ్రతికితే జీవితంలో ఆనందంగా ఎప్పటికీ ఉండలేరు. జీవితాన్ని ఆనందంగా మలచుకోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

చింతించడం మానేయండి

జీవితంలో మీరు ఎలాగైనా ఉండండి.. ఎలాగైనా మాట్లాడండి.. కానీ మీ కోసం మీరు బతకడం మాత్రం మర్చిపోకండి. ఈ క్షణం బాధాకరంగా ఉన్నా ఎల్లప్పుడే అదే మీ వెంటరాదు. రాత్రి చీకటి కరిగిపోయినట్లు విషాదం కూడా కరిగిపోతుంది. వెలుగులీనుతూ తెలతెలవారినట్లే ఆనందం మీ జీవితంలో ఉదయిస్తుంది. రేపటి భవిష్యత్తు గురించి ఎక్కువగా చింతించే వారు ఈ రోజును ఆనందించలేరన్నది అక్షర సత్యం. ఇలాంటి అవాంఛిత ఆలోచనలు నేటి ఆనందాన్ని దోచుకుంటాయి. కాబట్టి దేని గురించి ఎక్కువగా చింతించకుండా.. ఈ రోజును ఆనందంగా ఆనందించండి.

నేడు రేపు ఒకేలా ఉండవు.. మార్పు అనివార్యం

ఈ రోజు మనం కష్టతరమైన జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు. రేపు ఇలాగే ఉంటుందని చెప్పలేం. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు ఇవన్నీ తాత్కాలికం. ఈ రోజులా రేపు ఉండదు. కాలం గడుస్తున్న కొద్దీ కష్టాలు తొలగిపోయి మంచి రోజులు వస్తాయనే విశ్వాసం కలిగి ఉండాలి. మీకు ఏది ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలనే సంకల్పం మీలో ఉంటే, మీరు ఈ రోజును ప్రశాంతంగా గడుపుతారు.

ఇవి కూడా చదవండి

సమస్యలను సులభమైన మార్గంలో పరిష్కరించుకోవాలి

సమస్యలు లేని వ్యక్తి ఈ భూమిపై దాదాపు లేడనే చెప్పాలి. కానీ సమస్యలలో మునిగిపోవడం ఒక్కటే జీవితం కాకూడదు. కష్టం, సమస్య, సవాలు ఏదైనా ఎదురైతే దానిని తెలివిగా ఎలా పరిష్కరించాలో తెలుసుకోవాలి. సవాళ్లను ధైర్యంగా స్వీకరిస్తే జీవితంలో సంతోషంగా ఉండొచ్చు.

పరిపూర్ణత కోసం పరుగెత్తకండి

జీవితంలో ఎవరూ పరిపూర్ణులు కారు. మంచి విషయమే అయినా ఏదీ పరిపూర్ణంగా ఉండదు. పర్‌ఫెక్షన్‌ కోసం మీరు దానివెంట పరుగెత్తేకొద్దీ మీలో సంతోషం మాయం అవుతుంది. ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి చేసే పని పర్ఫెక్ట్ గా ఉండాలనే మనస్తత్వం వద్దు. ఏదైనా తప్పు జరిగితే, అది మళ్లీ జరగకుండా జాగ్రత్త పడండి. ఈ సలహా పాటిస్తే జీవితంలో సంతోషాన్ని పొందవచ్చు.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి

మీ దినచర్యలో శారీరక శ్రమపై కూడా దృష్టి పెట్టండి. వ్యాయామం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇది ఆరోగ్యం, శక్తిని పెంచుతుంది. ఫలితంగా ప్రశాంతంగా, సంతోషంగా ఉండవచ్చు.

నిరంతరం నేర్చుకోవడం అలవాటు చేసుకోండి

మరొకరి కోసం జీవించడం కంటే మన కోసం జీవించడంలో ఎక్కువ అర్థం ఉంది. ఇతరుల నుంచి ఎక్కువగా ఆశించకుండా మనలోనే ఆనందాన్ని వెతుక్కోవాలి. కాబట్టి ఇతరులకు ఏమి తెలుసు , వారేమి చేస్తున్నారు అనే ఆలోచనను వదిలేయాలి. మీ మనసుకు నచ్చినట్లు నిజాయితీగా జీవించండి. ఇది నిజమైన ఆనందానికి దారి తీస్తుంది.

మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి

మీరు సంతోషంగా ఉండాలంటే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. క్రమం తప్పకుండా నిద్ర, ఆహారం తీసుకోవడం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం వంటివి చేయాలి. స్వీయ సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే అది ఆనందానికి దారి తీస్తుంది.

ఇతరుల పట్ల కరుణతో ఉండండి

కొంతమంది తమ స్వంత జీవితాల గురించి అధికంగా ఆలోచిస్తూ, స్వార్ధపూరితంగా ఉంటారు. ఇలాంటి వ్యక్తులు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. అందువలన, ఇతరులకు సాయపడటం, వారిపట్ల దయ కలిగి ఉండటం అలవాటు చేసుకోవాలి. ఇది మనసుకు హాయినిచ్చి, ఆనందాన్ని కలిస్తుంది. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం అలవాటు చేసుకోండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.