Small saving schemes: పొదుపు మంత్రం పాటించాలనుకుంటున్నారా? వీటిల్లో పెట్టుబడి బెస్ట్
ప్రతి ఒక్కరూ పొదుపు చేయడాన్ని అలవాటు చేసుకుంటే జీవితంలో ఆర్థిక ఇబ్బందులను అధిగమించవచ్చు. తమకు వచ్చే జీతంలో కొంత మొత్తాన్ని పొదుపు చేసి, దాన్ని వివిధ మార్గాలలో పెట్టుబడిగా పెట్టవచ్చు. ఇలాంటి వాటిలో బ్యాంకులు, పోస్టాఫీసులు అందించే చిన్న పొదుపు పథకాలు ముందు వరుసలో ఉంటాయి. వాటిలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద రాబడులు పొందే అవకాశం ఉంటుంది.
చిన్న పొదుపు పథకాల వడ్డీరేట్లను ప్రతి మూడు నెలలకు ఒక్కసారి ప్రభుత్వం సమరిస్తుంది. ప్రతి నెలా కొంత మొత్తాన్ని దాచుకుంటూ వెళితే నిర్ణీత కాాలానికి వడ్డీతో సహా పెద్ద మొత్తాన్ని పొందవచ్చు. చిన్న పొదుపు పథకాలు చాలా సురక్షితంగా ఉంటాయి. కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పిస్తాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ 2024 డిసెంబర్ 31న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ స్కీమ్ (ఎన్ఎస్సీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) తదితర పథకాల వడ్డీరేట్లను సమీక్షించింది. గత నాలుగు త్రైమాసికాలుగా పొదుపు పథకాల వడ్డీరేట్లు యథాతథంగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో చివరి సర్దుబాటు జరిగింది. కాగా.. దేశంలో అమలవుతున్న వివిధ చిన్నపొదుపు పథకాల గురించి తెలుసుకుందాం.
జాతీయ పొదుపు (నెలవారీ ఆదాయ ఖాతా) పథకం
ఈ పథకంలో కనీష్టంగా రూ.వెయ్యి, గరిష్టంగా ఒక ఖాతాలో రూ.9 లక్షలు, జాయింట్ ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. నిబంధనలకు లోబడి ఒక ఖాతాదారుడు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను నిర్వహించే అవకాశం ఉంది. మూడేళ్లలోపు ఖాతాను మూసివేస్తే 2 శాతం, ఏడాదిలో మూసివేస్తే ఒక శాతాన్ని డిపాజిట్ నుంచి తగ్గిస్తారు. దీనిపై 7.4 శాతం వడ్డీ అందిస్తున్నారు.
నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతా
ఈ ఖాతాలను ఏడాది, రెండేళ్ల, మూడేళ్లు, ఐదేళ్ల వ్యవధిలో తీసుకోవచ్చు. కనీస డిపాజిట్ రూ.వెయ్యి చేయాలి. గరిష్ట డిపాజిట్ కు పరిమితి లేదు. ఖాతాను ఆరు నెలల తర్వాత మూసివేయవచ్చు. దీనిలో ఐదేళ్ల డిపాజిట్లకు ఆదాయపు పన్ను చట్టంలోని 80 సీ తగ్గింపునకు అర్హత లభిస్తుంది. ఇక ఏడాది డిపాజిట్లకు 6.90, రెండేళ్లకు 7 శాతం, మూడేళ్లకు 7.10, ఐదేళ్లకు 7.50 శాతం వడ్డీ అందిస్తారు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
ఈ పథకంలో గరిష్టంగా రూ.30 లక్షలు, కనిష్టంగా రూ.వెయ్యి డిపాజిట్ చేయవచ్చు. వ్యక్తిగతంగా లేదా జీవితం భాగస్వామితో కలిసి ఖాతా తెరిచే అవకాశం ఉంది. ఐదు సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత మూసివేయవచ్చు. అవసరమైతే మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. కొన్ని షరతులకు లోబడి అకాల మూసివేతకు అవకాశం ఉంది. ఈ పథకంలో 8.20 శాతం వడ్డీ అందిస్తున్నారు.
నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్
ఈ పథకంలో డిపాజిట్లకు 7.7 శాతం వడ్డీని అందిస్తున్నారు. కనీసం రూ.వెయ్యి డిపాజిట్ చేయాలి. గరిష్ట పరిమితి లేదు. ఐదేళ్లకు ఖాతా మెచ్యూర్ అవుతుంది. ఖాతాను తన కోసం లేదా మైనర్ల తరఫున తెరిచే వీలుంటుంది. మైనర్ పదేళ్ల వయస్సు వచ్చిన తర్వాత సింగిల్ హోల్డర్ తరహా ఖాతాను ప్రారంభించవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
ఒక ఆర్గిక సంవత్సరంలో కనీస డిపాజట్ గా రూ.వెయ్యి, గరిష్టంగా రూ.1.50 లక్షలు జమ చేసుకోవచ్చు. మూడు నుంచి ఆరవ ఆర్థిక సంవత్సరం వరకూ రుణ సౌకర్యం పొందే వీలుంటుంది. సుమారు 15 ఏళ్లకు ఖాతా మెచ్యూర్ అవుతుంది. దీనిలో డిపాజిట్లకు 7.01 శాతం వడ్డీని అందిస్తున్నారు.
పైన తెలిపిన పథకాలతో పాటు సుకన్య ఖాతాలకు రూ.8.20, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ కు 7.50, కిసాన్ వికాస్ పత్రకు 7.50, రికరింగ్ డిపాజిట్లకు 6.70, పోస్టాఫీసు సేవింగ్ ఖాతాలకు నాలుగు శాతం వడ్డీని రేట్లు అమలవుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి