Cyber Crime: కొంప ముంచిన కొరియర్ సర్వీస్.. రూ.1.50 కోట్లు హాంఫట్..!
సైబర్ నేరాలు రోజుకో రూపాన్ని సంతరించుకున్నాయి. మోసగాళ్లు చాలా తెలివిగా ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. వివిధ కేసుల పేరుతో భయపెట్టి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందో.. అదే స్థాయిలో నేరగాళ్లు మోసాలు చేయడానికి వినియోగిస్తున్నారు. ఇటీవల దక్షిణ ముంబైకి చెందిన ఓ మహిళను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. ఆమెను కేసుల పేరుతో భయపెట్టి రూ.1.50 కోట్లు దోచుకున్నారు.
దక్షిణ ముంబైలో నివసించే 78 ఏళ్ల మహిళ అమెరికాలో ఉంటున్న తన కుమార్తెకు వివిధ ఆహార పదార్థాలను కొరియర్ చేసింది. మరుసటి రోజుకు ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వైపు నుంచి ఓ వ్యక్తి తనను పోలీస్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆమె పంపించిన కొరియర్ లో ఆహార పదార్థాలతో పాటు ఆమె ఆధార్ కార్డు, గడువు ముగిసిన పాస్ పోర్టులు. క్రెడిట్ కార్డులు, చట్టవిరుద్ధమైన పదార్థాలు, రెండు వేల యూఎస్ డాలర్లు ఉన్నాయని తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించి ఆమెకు అనేక ఫోన్ కాల్స్ వచ్చాయి. సైబర్ క్రైమ్, ఫైనాన్స్ డిపార్ట్ మెంట్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులమంటూ ఆమెను బెదిరించారు. ముంబైలోని ఓ ప్రముఖ బిల్డర్ కు ఈ మహిళ బంధువు కావడంతో అతడి పేరును కూడా వాడుకున్నారు. మనీ లాండరింగ్, డ్రగ్ సంబంధ ఆరోపణలు చేశారు.
ముంబై మహిళను నమ్మించడానికి నేరగాళ్లు వీడియో కాల్స్ లో సైతం కనిపించేవారు. ఆయా శాఖల డిపార్టుమెంట్ యూనిఫాం ధరించి మాట్లాడారు. కేసు పూర్వాపరాలు, కోర్టు విధించే శిక్ష గురించి తెలిపి ఆమెను భయపెట్టారు. దర్యాప్తు నివేదికల పేరుతో వివిధ నకిలీ పత్రాలను చూపించారు. ఉన్నతాధికారుల పేరుతో సైబర్ నేరగాళ్ల చేస్తున్న బెదిరింపులకు ఆ మహిళ భయపడింది. అలాగే వీడియో కాల్స్ లో యూనిఫాంలో కనిపించడంలో వారు నిజమైన అధికారులేనని నమ్మేసింది. వారి సూచనల మేరకు వివిధ బ్యాంకు ఖాతాలకు 1.50 కోట్లు పంపించింది. విచారణలో భాగంగా ఇలా డబ్బులను పంపించాలని ఆమెను నేరగాళ్ల బెదిరించారు.
డబ్బులు పంపించిన అనంతరం ఆమె తన కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిపింది. ఇదంతా సైబర్ క్రైమ్ అని వారు చెప్పడంతో తాను మోసపోయానని గుర్తించింది. వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు నేరాన్ని నివేదించింది. అయితే నగదును తరలించేందుకు సైబర్ నేరగాళ్ల పలు ఖాతాలను ఉపయోగించారని, వాటిని గుర్తించడం కష్టమని అధికారులు తేల్చి చెప్పారు. ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి