Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: బండెనక బండి కట్టి.. నియోజకవర్గాలకు దూరమవుతున్న ఆ కమలం నేతలు..

కరీంనగర్‌లో కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయినా నిరుత్సాహపడలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం కమలంలోనే కొనసాగారు. ప్రజా సమస్యలపై ఎన్నడూ వెన్ను చూపలేదు. అదే తెగువ.. ఎంపీగా నిలబెట్టింది. అదే కమిట్‌మెంట్‌... అధ్యక్ష బాధ్యతలు అప్పగించేలా చేసింది.

Telangana BJP: బండెనక బండి కట్టి.. నియోజకవర్గాలకు దూరమవుతున్న ఆ కమలం నేతలు..
Bandi Sanjay
Follow us
TV9 Telugu

| Edited By: Sanjay Kasula

Updated on: Feb 22, 2022 | 5:26 PM

ఒకప్పుడు తెలంగాణ బీజేపీ(BJP) వేరు.. ఇప్పుడు తెలంగాణ బీజేపీ వేరు. బండి సంజయ్‌(Bandi Sanjay) అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక.. కమలదళానికి హుషారొచ్చింది. కేడర్‌లో జోష్ వచ్చింది. కారు స్పీడ్‌కి(TRS) బ్రేకులేస్తాం.. అధికారాన్ని చేజిక్కించుకుంటామని సమరశంఖం పూరించారు బండి సంజయ్‌. అంతేకాదూ.. ఒక్కో నియోజకవర్గంలో బలపడుతూ ఉనికి చాటుతున్నారు. అయితే బండి సంజయ్ వెంట తిరుగుతున్న కొందరు నేతలు మాత్రం ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నారు. బండెనక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి.. తిరిగితే చాలని భావిస్తున్నారు కొందరు నేతలు. కాషాయ పార్టీలో కొంతమంది సొంత క్యాడర్ పెంచుకోకుండా నమ్ముకున్న నాయకుడి వెంట తిరుగుతూ కాలం గడిపేస్తున్నారు. ఇంతకీ ఆ నేతలు ఎవరు..? వారి గురించి పార్టీలో నడుస్తున్న చిట్ చాట్ ఏంటి..? ఇప్పుడు తెలుసుకుందాం..

కరీంనగర్‌లో కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయినా నిరుత్సాహపడలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం కమలంలోనే కొనసాగారు. ప్రజా సమస్యలపై ఎన్నడూ వెన్ను చూపలేదు. అదే తెగువ.. ఎంపీగా నిలబెట్టింది. అదే కమిట్‌మెంట్‌… అధ్యక్ష బాధ్యతలు అప్పగించేలా చేసింది. ఎంపీగా గెలవడం.. పార్టీ పగ్గాలు దక్కించుకున్నాడు.

గులాబీ బాస్‌ పదే పదే బండి సంజయ్‌ని టార్గెట్‌ చేస్తున్నారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, పాదయాత్రలు, ప్రజాసమస్యల పరిష్కారంపై అలుపెరగని పోరాటం చేస్తూ.. టీఆర్‌ఎస్‌కి ప్రత్యామ్నాయం తామేనని చాటిచెబుతున్నారు. బండి యమ స్పీడ్‌గా ముందుకెళ్తున్నారు.

దుబ్భాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయ ఢంకా మోగించడంతో బండిలో మరింత జోష్ పెరిగింది. దీనికితోడు పార్టీ హైకమాండ్‌లో మంచి పట్టు సంపాధించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా..బండి సంజయ్‌కి అతని చుట్టూ ఏర్పాటు చేసుకున్న కోటరీ భవిష్యత్‌లో ఇబ్బందిగా మారే ప్రమాదం పొంచి ఉందని ఆ పార్టీ అభిమానులు హెచ్చరిస్తున్నారు.

బండి చుట్టూ ఉన్న నేతలు.. గంగిడి మనోహర్ రెడ్డి

బండి సంజయ్ తన చుట్టూ ఉన్న నేతల్లో గంగిడి మనోహర్ రెడ్డి ఒకరు.. పాదయాత్ర ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. నిత్యం బండి సంజయ్ వెన్నంటి ఉండే నేతల్లో కీలక నాయకుడు. ఇతని సొంత నియోజకవర్గం ఉమ్మడి నల్లగొండలోని మునుగోడు.. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ మధ్య కాలంలో నియోజకవర్గానికి వెళ్లిన దాఖలాలు అసలే లేవు.. కేవలం బండి సంజయ్ చుట్టూ తిరిగితే సరిపోతుంది.. టికెట్ కన్ఫర్మ్ అన్నట్లు మనోహర్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. అయితే.. అసలు లోకల్ క్యాడర్ పెంచుకోకుండా టికెట్ కోసం బండి సంజయ్ పై ఒత్తిడి తెస్తే భవిష్యత్ లో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందనే పార్టీ శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు.

వీరేందర్ గౌడ్..

ఇక ఇదే కోవలో ఉన్న మరో నేత.. బండి సంజయ్ పాదయాత్ర కో ఇంచార్జ్ వీరేందర్ గౌడ్.. ఇప్పటి వరకు ఇతనికి ఏ నియోజకవర్గం నుంచి అవకాశం దొరుకుతుందనే క్లారిటీ లేదు. ఉప్పల్ ఎమ్మెల్యే గా టీడీపీ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయారు. 2014లో చేవెళ్ల ఎంపీగా పోటీ చేసి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మహేశ్వరంలో ఒక కాలు.. ఉప్పల్‌ నియోజకవర్గంలో మరో కాలు పెట్టి ఎక్కడ పనిచేసుకోకుండా బండి వెనకాలే తిరుగుతున్నారు.

గాలిలో మేడలు కట్టేస్తున్నారు.. తేడా కొడితే..

ఇక బండి సంజయ్ వెనకాల ఉండే వారిలో జూబ్లీహిల్స్ దీపక్ రెడ్డి, నర్సాపూర్ గోపి, నారాయణ్ ఖేడ్ సంగప్ప, వరంగల్ రాకేష్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొడుకు మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ తనయుడు రవి యాదవ్ ముఖ్యలని చెప్పుకోవచ్చు. పార్టీ సారథి టికెట్ ఇప్పిస్తారని గ్రౌండ్ వర్క్ చేయకుండానే గాలిలో పేక మేడలు కట్టేస్తున్నారు. రేపటి రోజు టికెట్ల విషయంలో తేడా కొడితే.. అవసరానికి రాష్ట్ర అధ్యక్షుడు వెనకాల తిప్పుకొని మోసం చేశాడనే అపప్రదను మోయాల్సివస్తుందని మరికొంత మంది నేతలు హెచ్చరిస్తున్నారు.

ఆ లాజిక్ మిస్సవుతున్నారేమో..!

బీజేపీలో వ్యవస్థ ఒక్క రాష్ట్ర అధ్యక్షుడి మీద నుంచే నడవదనే లాజిక్ ని కొత్తగా చేరిన నేతలు మిస్ అవుతున్నారని పాత నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కోర్ కమిటీ సభ్యులంతా సమిష్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు. ఒకరో.. ఇద్దరో.. అభ్యంతరం చెప్పినా చర్చ విస్తృతంగా జరిగే అవకాశం ఉంటుందంటున్నారు. బండి సంజయ్ కూడా పదేపదే తన అనుచరులకు గ్రౌండ్ వర్క్ ప్రిపరేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. వాళ్ళు మాత్రం అధ్యక్షుడి నీడను వదలకుండా తిరుగుతున్నారు. బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టాలంటే మాత్రం ఆ లాజిక్ అస్సలు మరిచిపోవద్దు.

అగస్త్య, టీవీ9, ప్రతినిధి, హైదరాబాద్

ఇవి కూడా చదవండి: Uttar Pradesh Assembly Election 2022: ఉత్తరప్రదేశ్‌లో రేపు జరిగే నాలుగో దశ పోలింగ్‌పైనే అందరి దృష్టి..

హస్తినలో మళ్లీ చక్రం తిప్పేది తెలుగువారేనా..? కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?