Cold Hit Alert: రికార్డుస్థాయిలో పెరుగుతున్న చలి తీవ్రత.. మరో రెండు రోజులు తప్పదంటున్న వాతావరణ శాఖ
రాష్ట్రంలో ఇటీవల చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. సంక్రాంతి పండుగ దాటాక కాస్త తగ్గుముఖం పట్టిన శీతల గాలులు హడలెత్తిస్తున్నాయి.
Cold Hit Weather alert in Telangana: రాష్ట్రంలో ఇటీవల చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. సంక్రాంతి పండుగ దాటాక కాస్త తగ్గుముఖం పట్టిన శీతల గాలులు హడలెత్తిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లో కూడా రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో పది డిగ్రీల కంటే దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొన్ని చోట్ల పొగ మంచు దట్టంగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తోంది. ఉదయం 8గంటల వరకు కూడా సూర్యుడు కనిపించడం లేదు. ఉదయం, సాయంత్రాల్లో రైతులు, కూలీలు, పశువుల కాపర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు చలిగాలుల తీవ్రతతో జలుబు, దగ్గు లక్షణాలతో బాధపడే కరోనా, ఆస్తమా రోగులు మరింత బాధపడుతున్నారు. చలి విజృంభణ కారణంగా రాత్రి, తెల్లవారుజామున విధులు నిర్వర్తించే వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అటు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా అర్లి(టీ) గ్రామంలో రికార్డుస్థాయిలో 4.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. గత పదేళ్లలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. అలాగే, ఆదివారం, సోమవారం కూడా ఇదే స్థాయిలో రాష్ట్రంలో కనిష్ట ఉష్టోగ్రతలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
హిమాలయాల్లో కేంద్రీకృతమైన గాలులతో దాని వెంబడి ఉన్న గాలులు కూడా చల్లగా మారుతున్నాయి. ఉత్తర భారతం నుంచి దక్షిణాదిలోకి ఉపరితల శీతల గాలులు ప్రయాణిస్తూ ఛత్తీస్‌గఢ్ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో తెలంగాణలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పశ్చిమ అస్థిరత ఎక్కువ ఎత్తులో ఏర్పడితే చలి ప్రభావం కాస్త తక్కువగా ఉంటుంది. కానీ తక్కువ ఎత్తులో ఏర్పడటంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. దీనికితోడుగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి తక్కువఎత్తులో ఉపరితల గాలులు వీస్తుండటంతో చలి ఎక్కువగా ఉంది.
చలి ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములు గు, కొత్తగూడెం, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. సాధారణంగా 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైతే.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటిస్తారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) January 29, 2022
Read Also…. Watch Video: లైవ్ మ్యాచులో భూకంపం.. 20 సెకన్ల పాటు దద్దరిల్లిన స్డేడియం.. వీడియో వైరల్