Monsoon Rain: తెలంగాణలో రెండో అతిపెద్ద నగరం.. చినుకు పడితే చాలు చిత్తడి చిత్తడే..
తెలంగాణలో రెండో అతిపెద్ద నగరం.. స్మార్ట్ సిటీ.. హిస్టారికల్ సిటీ, కేంద్ర ప్రభుత్వ అమృత్‌లో చోటు.. చెప్పుకునేందుకు ఇలాంటివి చాలానే ఉన్నాయి. కానీ.. చినుకు పడితే చాలు చిత్తడి చిత్తడే. గ్రేటర్ వరంగల్‌లో...
తెలంగాణలో రెండో అతిపెద్ద నగరం.. స్మార్ట్ సిటీ.. హిస్టారికల్ సిటీ, కేంద్ర ప్రభుత్వ అమృత్‌లో చోటు.. చెప్పుకునేందుకు ఇలాంటివి చాలానే ఉన్నాయి. కానీ.. చినుకు పడితే చాలు చిత్తడి చిత్తడే. గ్రేటర్ వరంగల్‌లో వాన వడితే వణుకే. వరంగల్‌లో రెయిన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎటు చూసినా మోకాళ్లోతు నీళ్లు కనిపిస్తాయి. వాహనదారుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడ గుంత ఉందో.. ఎక్కడ గొయ్యి పడిందో తెలీక నరకం చూస్తున్న దుస్థితి. కార్లు ఆగిపోతుంటే.. స్థానికులు తలో చేయి వేసి.. కాల్వగా మారిన రోడ్లను దాటిస్తున్నారు.
వరంగల్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. చిన్న వర్షానికే ప్రాచీన నగరం మొత్తం చెరువులు, కుంటలను తలపిస్తోంది. ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వస్తున్నా ఏమాత్రం అభివృద్ధి మచ్చుకైనా కనిపించదు. ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి సిటీ జలమయం అయిపోయింది. కొన్ని కాలనీల్లో ఇళ్లలోకి వర్షపునీరు చేరింది.
ఒకరోజు కురిసిన వర్షానికే వరంగల్ చిత్తడైపోయింది. మరి, నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో.. నగరవాసులు వణికిపోతున్నారు. ఇక.. కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనూ ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో 14.9సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
రుతుపవనాల ప్రభావంతో గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్బపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు నమోదవుతున్నాయని హైదరబాద్ వాతావరణ శాఖ తెలిపింది.దీని ప్రభావంతో ఈ నెల 13వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.