అప్పుల నుంచి బయట పడేందుకు స్కెచ్ వేశాడు.. బంగారం వ్యాపారిని కారు ఎక్కించుకుని.. చివరకు
వనపర్తి జిల్లాలో సంచలనం రేపిన బంగారం వ్యాపారి హత్య కేసును పోలీసులు చేధించారు. గత నెల 21న జరిగిన ఈ కిరాతకానికి సూత్రధారి తోటి వ్యాపారేనని నిగ్గు తేల్చారు. చిన్నంబావి మండలం వెలగొండ గ్రామ పరిధిలో నవంబర్ 21వ తేదిన గుంటూరుకు చెందిన బంగారం వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు.
వనపర్తి జిల్లాలో సంచలనం రేపిన బంగారం వ్యాపారి హత్య కేసును పోలీసులు చేధించారు. గత నెల 21న జరిగిన ఈ కిరాతకానికి సూత్రధారి తోటి వ్యాపారేనని నిగ్గు తేల్చారు. చిన్నంబావి మండలం వెలగొండ గ్రామ పరిధిలో నవంబర్ 21వ తేదిన గుంటూరుకు చెందిన బంగారం వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. గ్రామపంచాయితీ సెక్రటరీ ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల వేట సాగించారు వనపర్తి పోలీసులు. దీంతో హత్యకు పాల్పడిన నిందితులను తక్కువ సమయంలోని గుర్తించి అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్నేళ్ల క్రితం రాజస్థాన్ నుంచి వచ్చి నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో ధనలక్ష్మీ జ్యూవెలర్స్ పేరుతో బంగారం షాపు నిర్వహిస్తున్నాడు దీపక్ మాలీ. ఈ నేపథ్యంలో వ్యాపారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన శేషుతో పరిచయం ఏర్పడింది. మూడేళ్ల క్రితం నుంచి ఇరువురి మధ్య బంగారం వ్యాపారం సాగుతోంది. తన వద్ద ఉన్న బంగారాన్ని దీపక్ కు ప్రతి 15, 30రోజులకొకసారి అమ్మేసి వెళ్తుంటాడు. అయితే గడచిన కొన్నాళ్ల నుంచి దీపక్ వ్యాపార నష్టాలతో పాటు కుటుంబ ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో తన అప్పులు తీర్చుకునేందుకు దీపక్ దారుణానికి ఒడిగట్టాడు. తన వద్దకు వచ్చే శేషు భారీ నగదు, బంగారం కలిగి ఉంటాడని ఆలోచించి క్రూరమైన ఆలోచన చేశాడు. ఎవరికి తెలియకుండా శేషును అంతమొందిస్తే అతని వద్ద ఉన్న బంగారం, నగదుతో ఆర్థిక సమస్యల నుంచి బయట పడవచ్చని భావించాడు. అనుకున్నదే తడవుగా ఆలోచనను అమలు చేసేందుకు రాజస్థాన్ లో ఉన్న తన సొదరుడు రమేష్ మాలీ కి చెప్పి ఒప్పించాడు. సొదరుడుతో పాటు మరో ఇద్దరు జగదీష్ భార్వాడ్, ముఖేష్ మేఘ్వల్ లను ఈ దురాగతంలో భాగస్వామ్యులను చేశాడు. ఈ ముగ్గురిని రాజస్థాన్ నుంచి రప్పించాడు.
ఈ నెల 21న బంగారానికి సంబంధించిన బాకీ పైసలు వసూలు చేసుకునేందుకు శేషు బిజినేపల్లిలోని దీపక్ వద్దకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన శేషుకు ఇవ్వాల్సిన డబ్బులు రూ.6,50,000 ఇచ్చేశాడు. ఎలాగు శేషు మహబూబ్ నగర్ కు వెళ్తాడు అని తెలిసి తాను కారులో అక్కడికే వెళ్తున్నానని నమ్మించి వాహనం ఎక్కించుకొని బయలదేరాడు. ఇంతలో మార్గమధ్యలోని మంగనూరులో ఉన్న సొదరుడుతో పాటు మరో ఇద్దరిని అదే కారులో ఎక్కించుకున్నాడు. కొద్ది దూరం ప్రయాణించాక నిందితులు తమ ప్రణాళికను అమలు చేశారు. ఒక్కసారిగా ముగ్గురు నిందితులు శేషుపై పిడిగుద్దుల వర్షం గుప్పించారు. దీంతో శేషు స్పృహ కోల్పోగా.. అతని వద్ద ఉన్న నగదు, వ్యాపారం నిమిత్తం తెచ్చిన బంగారాన్ని దొచుకున్నారు. ఎక్కడా ఆధారాలు లభించకూడదని భావించి శేషు మొబైల్ ఫోన్ ను మార్గ మధ్యలోనే బయటకు విసిరేశారు. ఇక అదే కారులో శేషుతో పాటు అటూ ఇటూ తిరుగుతూ చివరకు వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని వెలగొంగ గ్రామ శివారుకు చేరుకున్నారు. ఇంతలోనే శేషు కు స్పృహ రావడంతో ముగ్గురు నిందితులు రెచ్చిపోయి.. టవల్ తో శేషు ముక్కు, నోరు మూసి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. అనంతరం రోడ్డు పక్కన గుంతలో మృతదేహాన్ని పడేశారు. ఇక బంగారం, నగదు దోచుకున్న ఖాళీ బ్యాగులో శేషు బట్టలు పెట్టి.. ఆ బ్యాగును బుద్దారం గండిచెరువులో పడేశారు.
వీడియో చూడండి..
ఇక హత్య కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. రాజస్థాన్ కు చెందిన వారిగా నిర్ధారణ తర్వాత వారిని అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఇక అసలు సూత్రధారి దీపక్ ను బిజినేపల్లిలో అరెస్టు చేశారు. మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల నుంచి రూ.57,00,000లక్షల విలువల గల 780.610గ్రాముల బంగారం, రూ.6,53,000లక్షల విలువగల వెండి ఆభరణాలు, రూ.6,53,000లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే బోలెరో వాహనం, ఒక బైక్, మూడు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..