నమ్మలేకపోతున్నారా? ఇది నిజం! డేటింగ్, పెళ్లికి ప్రభుత్వం డబ్బులిస్తోంది.. ఎక్కడో తెలుసా?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల ఒక సమస్యగా మారుతుంటే, ఒక దేశంలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ జనాభా తగ్గిపోతుండటం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. యువత పెళ్లిళ్ల మీద ఆసక్తి చూపడం లేదు, అసలు డేటింగ్ అంటేనే ..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల ఒక సమస్యగా మారుతుంటే, ఒక దేశంలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ జనాభా తగ్గిపోతుండటం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. యువత పెళ్లిళ్ల మీద ఆసక్తి చూపడం లేదు, అసలు డేటింగ్ అంటేనే భయపడుతున్నారు. దీంతో దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని గ్రహించిన అక్కడి ప్రభుత్వం ఒక వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎవరైనా సరే డేటింగ్ మొదలుపెడితే చాలు వారికి నగదు బహుమతులు ఇస్తామని ప్రకటించింది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే మరింత పెద్ద మొత్తంలో పారితోషికం, పిల్లల్ని కంటే ఏకంగా లక్షల్లో ప్రోత్సాహకాలు అందిస్తామని ఆఫర్ చేస్తోంది. ఇంతకీ ఆ దేశం ఏది? అక్కడ యువత ఎందుకు ఇలా తయారయ్యారు?
ఈ వింతైన పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశం మరెదో కాదు.. అది ‘దక్షిణ కొరియా’ . ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యల్ప జననాల రేటు నమోదవుతున్న దేశం ఇదే. ఇక్కడ జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోవడం, ఉద్యోగాల్లో విపరీతమైన పోటీ ఉండటం వల్ల యువత పెళ్లి అనే బంధానికి దూరంగా ఉంటున్నారు. పెళ్లి చేసుకుంటే బాధ్యతలు పెరుగుతాయని, ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని వారు భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వం జోక్యం చేసుకుని, ఒకరినొకరు కలుసుకోవడానికి ప్రోత్సహించడమే కాకుండా, పెళ్లి చేసుకున్న జంటలకు గృహ రుణాలు, ఇతర సౌకర్యాల్లో భారీ రాయితీలు ఇస్తోంది. కొన్ని నగరాల్లో అయితే డేటింగ్ కోసం ప్రత్యేకమైన ఈవెంట్లను కూడా ప్రభుత్వం నిర్వహిస్తోంది.
దక్షిణ కొరియాలో జననాల రేటు ఎంతలా పడిపోయిందంటే.. ఒక మహిళ తన జీవితకాలంలో కనే పిల్లల సగటు సంఖ్య 0.7 కంటే తక్కువకు చేరుకుంది. జనాభా స్థిరంగా ఉండాలంటే ఈ సంఖ్య కనీసం 2.1 ఉండాలి. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయి, పని చేసే యువత కరువయ్యే ప్రమాదం ఉంది. దీనిని అరికట్టడానికి ప్రభుత్వం ‘బేబీ బోనస్’ పథకాలను అమలు చేస్తోంది. బిడ్డ పుట్టినప్పటి నుంచి వారు పాఠశాలకు వెళ్లే వరకు ప్రతి నెలా కొంత నగదును తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తోంది. అయినప్పటికీ అక్కడి యువత మాత్రం కెరీర్, స్వేచ్ఛకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
కేవలం ఆర్థిక పరమైన ఇబ్బందులే కాకుండా, సామాజిక కారణాలు కూడా ఈ పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు. కఠినమైన పని వేళలు, పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చు, మారుతున్న ఆలోచనా విధానం వల్ల కొరియా యువత ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేసినా, యువత మనస్తత్వంలో మార్పు రాకపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
ఒకప్పుడు అభివృద్ధిలో దూసుకుపోయిన ఈ ఆసియా టైగర్, ఇప్పుడు జనాభా సంక్షోభంతో కునారిల్లుతోంది. ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా ఇది ఒక హెచ్చరిక లాంటిదే అని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ప్రేమకు, పెళ్లికి డబ్బు ఆశ చూపడం అనేది కొరియాలో ఒక అనివార్యమైన చర్యగా మారింది. మరి ప్రభుత్వం ఇస్తున్న ఈ ఆఫర్లను చూసి అయినా అక్కడి యువత తమ మనసు మార్చుకుంటారో లేదో చూడాలి.
