Telangana: వీఆర్ఏలతో మంత్రి కేటీఆర్ సమావేశం.. విధుల్లో చేరాలని విజ్ఞప్తి.. తగ్గేదేలే అంటున్న VRAలు
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ ఏలు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు వీఆర్ ఏ సంఘం నాయకులు. మరోవైపు వీఆర్ఏల..
Telangana: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ ఏలు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు వీఆర్ ఏ సంఘం నాయకులు. మరోవైపు వీఆర్ఏల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. వీఆర్‌ఏలంతా సమ్మె విరమించి వెంటనే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ బేగంపేట మెట్రోభవన్‌లో వీఆర్‌ఎల సంఘం ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్.. వారి డిమాండ్లపై చర్చలు జరిపారు. వీఆర్‌ఏలు మాత్రం.. తమ సమస్యలు పరిష్కరించేవరకు వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. తమ డిమాండ్ల సాధనకోసం కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్న వీఆర్ఏలు.. ఇటీవల అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఆరోజు వారిని పిలిపించుకుని మాట్లాడిన కేటీఆర్.. మరోసారి మాట్లాడుదామని నచ్చచెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి.. వీఆర్‌ఎ సంఘాల నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు కేటీఆర్. వీఆర్‌ఏల సమస్యల పరిష్కారం, ఇచ్చిన హామీల అమలుపై సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి వీఆర్ఏలను వేరుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. ఆందోళన విరమించి వెంటనే రోజువారీ విధుల్లో చేరాలని కోరారు.
ఇచ్చిన మాట ప్రకారం.. తమతో సమావేశం ఏర్పాటు చేసినందుకు.. మంత్రి కేటీఆర్ కు వీఆర్ ఏ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా తమకు విశ్వాసం ఉందన్న వీఆర్‌ఏలు… సమస్యల్ని త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 25వేల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అయితే, తమ డిమాండ్లు పరిష్కరించే వరకు.. సమ్మె విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దీంతో, వీఆర్‌ఏల ఆందోళన యథాతధంగా కొనసాగనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..