Praveen Kumar’s Oath: దుమారం రేపుతున్న స్వేరోస్ ప్రతినిధుల ప్రతిజ్ఞ.. సారీ చెప్పినా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను వీడని వివాదం..
Swaero : మనసావాచా చేసేదే ప్రమాణం. చెడుకు దూరంగా ఉంటామనో, నీతినియమాలకు కట్టుబడతామనో ప్రతిజ్ఙ చేయాలి. కానీ అక్కడ ప్రమాణం..వివాదానికి కారణమైంది. మతవిశ్వాసాలను కించపరిచేలా సాగిన ఆ ప్రమాణంపై దుమారం రేగుతోంది.
IPS Officer in Trouble: సున్నితమైన అంశాలు వివాదాస్పదం కాకుండా జాగ్రత్తపడాలి. ఎవరి పరిధుల్లో వారుండాలి. ఎవరో అనాలోచితంగా ఇలాంటి ప్రమాణం చేశారంటే అర్ధంచేసుకోవచ్చు. కానీ ఐపీఎస్ అధికారి…తెలంగాణ గురుకులాల కార్యదర్శిగా ఉన్నతస్థానంలో ఉన్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్..ముందు వరసలో నిలుచోవడంపై ఇప్పుడు పెద్ద రగడే జరుగుతోంది.
స్వేరోస్ కార్యక్రమంలో జరిగిందీ వివాదాస్పద ప్రతిజ్ఞా కార్యక్రమం. పెద్దపల్లి జిల్లాలో బౌద్ధస్థూపం దగ్గర జ్ఙానదీక్ష, భీందీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథి ప్రవీణ్‌కుమారే. స్వేరోస్ వ్యవస్థాపకుడు కూడా ఆయనే. అందుకే ఈ ప్రతిజ్ఞ ఆయన మెడకు చుట్టుకుంది.
హిందూదేవుళ్లను అవమానించేలా, సంప్రదాయాలను కించపరిచేలా ప్రతిజ్ఞ చేయడాన్ని ఆ కార్యక్రమానికి హాజరైన కొందరు బహిరంగంగానే తప్పుపట్టారు. దీంతో వివాదాస్పద ప్రతిజ్ఞపై వేదికపైనే స్పందించారు ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్. భీందీక్ష ఏ కులానికీ మతానికీ వ్యతిరేకం కాదన్నారు . అన్ని కులాలు, మతాలు, విశ్వాసాలను అంతా గౌరవించాలన్నారు.
అప్పటికే విమర్శలజోరు పెరగటంతో.. ఎవరి మనోభావాలైనా నొప్పించి ఉంటే క్షమించాలంటూ తర్వాత ప్రకటన కూడా విడుదల చేశారు. దేవుళ్ళను కించపరిచేలా మాట్లాడిన వ్యక్తులతో తనకెలాంటి సంబంధం లేదన్నారు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్.
ప్రవీణ్‌కుమార్ వివరణ ఇచ్చినా.. ఆ ప్రతిజ్ఞపై విచారం వ్యక్తంచేసినా వివాదం ఆగలేదు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ని సర్వీస్ నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది వీహెచ్‌పీ. బీజేపీ నేతలు కూడా స్వేరోస్ కార్యక్రమంలో హిందూదేవతలకు వ్యతిరేకంగా జరిగిన ప్రక్రియపై మండిపడుతున్నారు.
ప్రవీణ్‌కుమార్‌కి వివాదాలు కొత్త కాదు. అయితే సున్నితమైన అంశం కావటంతో స్వేరోస్ ప్రతిజ్ఙ ప్రకంపనలు సృష్టిస్తోంది. కీలక బాధ్యతల్లో ఉన్న ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లతో వివాదం ముదిరేలా ఉంది.