Wonder Kid: మూడున్నరేళ్లకే వండర్ కిడ్‌గా పేరొందిన విరాజ్.. బుడ్డోడి ట్యాలెంట్ చూస్తే మతిపోవాల్సిందే!
మూడున్నరేళ్ల వయస్సులో ఓ బుడతడు వండర్ కిడ్ అనిపించుకుంటున్నాడు. తన జ్ఞాపకశక్తితో అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. చిన్న వయస్సులోనే అనేక పురస్కారాలు, అవార్డులు అందుకుని ఔరా అనిపిస్తున్నాడు. పిట్ట కొంచెం కూత ఘనం అనే నానుడికి సరిగ్గా సూటైన ఈ బుడతడి ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం పదండి.

మెడ నిండా మెడల్స్ .. ఇంటి నిండా మెమెంటోలు, ఎటూ చూసినా ప్రశంసా పత్రాలు ఇవన్ని ఆ బుడతడి ప్రతిభకు దక్కిన పురస్కారాలు. ముద్దుగా కనిపిస్తున్న ఈ బాలుడు కాదు కాదు.. వండర్ కిడ్ పేరు విరాజ్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భవనీనగర్ కు చెందిన నీటి పారుదల శాఖ ఉద్యోగి శ్రీధర్, శ్రావణి దంపతుల కుమారుడు విరాజ్. ఈ బుడ్డోడు 2021 సెప్టెంబర్ 7న జన్మించాడు. విరాజ్ పెరిగి మాటలు నేర్చుకుంటున్న సమయంలో తల్లిదండ్రులు చెప్పిన మాటలను అలాగే తిరిగి చెప్పేవాడు. దీంతో తల్లిదండ్రులు విరాజ్‌కు పద్యాలు, ఇంగ్లీషు పదాలు నేర్పించడం స్టార్ట్ చేశారు. అయితే వారు చెప్పిన పద్యాలు, పదాలను గుర్తుపెట్టుకొని కరెక్ట్‌గా చెప్పేవాడు విరాజ్. దీంతో విరాజ్ ఐక్యూను గుర్తించిన తల్లిదండ్రులు పద్యాలు, కథలు నేర్పించారు. నిద్రలో అడిగినా గుర్తు పెట్టుకుని నేర్చుకున్నవి తిరిగి చెప్పడంతో.. తల్లదండ్రులు వివిధ సంస్ధలను సంప్రదించారు. అక్కడ విరాజ్ జ్ఞాపక శక్తిని పరీక్షించిన సదరు సంస్ధలు అనేక అవార్డులు, జ్ఞాపికలు అందించారు. ఇలా కేవలం మూడున్నరేళ్ల వయస్సులోనే విరాజ్ అనేక పురస్కాలు అందుకొని ఇందూరు వండర్ కిండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఈ బడ్డోడి నైపుణ్యాన్ని గుర్తించిన ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు విరాజ్‌ను పరీక్షించారు. వారు పెట్టిన టెస్ట్‌లో విరాజ్ 16 శ్లోకాలు, 14 ఆంగ్ల పద్యాలు, 20 ఆంగ్ల పదాలు, మానవ శరీరంలోని భాగాల పేర్లు, 13 చిహ్నాలు, 11 రంగులు, 22 యాక్షన్స్, పండ్లు, కూరగాయలు, పక్షుల పేర్లు, జంతులవు పేర్లు, నెలలు, వారాల పేర్లును అవలీలగా చెప్పేశాడు. దీంతో మూడేళ్ల 2నెలల వయస్సులో ఇండియన్ బుక్ ఆఫ్ రీకార్డులో చోటు దక్కించుకున్నాడు. ఇదే కాకుండా శ్లోకాలు, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు కూడా అవలీలగా సమాధానం చెప్పి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోనూ చోటు సంపాధించాడు. అసాధారణ జ్ఞాపకశక్తితో కలాం వరల్డ్ రికార్డును సైతం చెజిక్కించుకున్నాడు.
కేవలం మూడున్నరేళ్ల వయస్సు ఉన్న విరాజ్ గత ఐదు నెలల వ్యవధిలో అనేక పురస్కారాలు, ప్రశంసా పత్రాలు అందుకున్నాడు. ఇదే కాకుండా తన అసాధారణ జ్ఞాపకశక్తితో విరాజ్ సూపర్ కిడ్ అవార్డును కూడా దక్కించుకున్నాడు. ఇంటర్నేషనల్ స్టార్ కిడ్,. టీటీహెచ్ నేషనల్ లెవల్ కాంటెస్టులోను పాల్గొని ప్రతిభ కనబరిచాడు. శ్లోకా కాంటెస్టులో.. సాంస్కతిక కళాక్షేత్రం విరాజ్‌ను ప్రథమ బహుమతితో సత్కరించింది. చిన్న వయస్సులో తమ కుమారుడు విరాజ్ సాధించిన విజయాలు చూసి.. తల్లిదండ్రులు ఊబ్బితబ్బై పోతున్నారు. తన జ్ఞాపకశక్తితో సూపర్ కిడ్ గా గుర్తింపు సాధించడం గర్వంగా ఉందని చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




