రోడ్డుపై వరినాట్లు వేసి వెరైటీ నిరసన.. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లెందుకు గ్రామస్తుల వినూత్న ప్రయత్నం..
Nallagonda District: తమ సమస్యల పరిష్కారానికి అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తాం.. విజ్ఞప్తి చేస్తాం.. అయినా పరిష్కారం కాకపోతే ధర్నాలు వంటి ఆందోళనలు చేస్తాం. అవసరమైతే నిరసన కూడా వ్యక్తం చేస్తాం. నిరసనలలో కూడా వెరైటీ, సీజన్ నిరసనలు కూడా..
నల్లగొండ జిల్లా న్యూస్, జూలై 22: తమ సమస్యల పరిష్కారానికి అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తాం.. విజ్ఞప్తి చేస్తాం.. అయినా పరిష్కారం కాకపోతే ధర్నాలు వంటి ఆందోళనలు చేస్తాం. అవసరమైతే నిరసన కూడా వ్యక్తం చేస్తాం. నిరసనలలో కూడా వెరైటీ, సీజన్ నిరసనలు కూడా ఉంటాయి.. తమ ఊర్లోని అంతర్గత రోడ్లు మరమ్మత్తులు చేయాలంటూ గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అదెలాంటి నిరసన అంటే.. అనేక గ్రామాల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉండి చినుకు పడితే చిత్తడిగా మారుతున్నాయి. నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అంతర్గత రోడ్లు దారుణంగా తయారయ్యాయి.
అంతర్గత రోడ్ల బురదమయం కావడంతో స్థానికులు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. తమ గ్రామ అంతర్గత రోడ్లను మరమ్మత్తు చేయాలంటూ నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం జంగాల వారి గూడెం వాసులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో 1500 జనాభా ఉంది. తమ గ్రామ అంతర్గత రోడ్లను మరమ్మతులు చేయాలంటూ స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ వరకు వినతి పత్రాలు విజ్ఞప్తులు చేశారు. అయినా ఎవరు స్పందించలేదు.
దీంతో వర్షాకాలంలో అంతర్గత రోడ్లతో పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఈ గ్రామస్తులు వెరైటీగా నిరసన వ్యక్తం చేశారు. వర్షాకాలం సీజన్‌కు అనుగుణంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. వర్షంలోనూ తడుస్తూ రోడ్లపై గ్రామస్తులు వరినాట్లు వేశారు. అంతర్గత రోడ్లను బాగు చేయాలని కోరారు. లేకపోతే తమ ఆందోళనలను ఉదృతం చేస్తామని గ్రామస్తులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..