టమాటా మీద పడ్డ దొంగల కన్ను.. రాత్రికి రాత్రే 4 క్వింటాలు చోరీ.. సీసీటీవీ కెమెరాలను ఆశ్రయిస్తున్న రైతులు..!
Maharashtra News: దేశంలో టమాటా ధరల మంట ఇంకా చల్లారడం లేదు. ఖరీదైన వస్తువుల జాబితాలో చేరడంతో వాటి చోరీలు కూడా ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం దొంగలు బంగారం, వెండి కోసం రావడం లేదు.. టమాటాలు దోచుకెళ్లడానికే వస్తున్నారు. ఎలా కొనాలో తెలియక జనాలు ఇబ్బందులు పడుతుంటే.. ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు టెన్షన్ పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో 400 కేజీల టమాటాలు చోరీకి గురయ్యాయి.
Maharashtra News: టమాటాలతో కూర వండుకున్నారంటే.. వాళ్లు ఉన్నొళ్లే అనుకునే స్థాయికి పెరిగాయ్ వీటి ధరలు. దేశవ్యాప్తంగా టమాట ధరలు దూసుకుపోతున్నాయ్. కిలో 150 రూపాయల పైనే పలుకుతోంది. కొన్ని చోట్ల అయితే డబుల్ సెంచరీ దాటేసింది. అన్నీ కూరగాయల ధరలు దాదాపు ఇలానే ఉన్నాయ్.. అందులో టమాట టాప్ లేచిపోతోంది. తప్పనిసరి అనుకుంటే తప్ప.. జనాలు టమాటాల ముఖం కూడా చూడడానికి పూనుకోవడంలేదు. అయితే ఇన్నాళ్లూ టమాటా సాగు చేసి నష్టపోయిన రైతుల ముఖాల్లో మాత్రం ఆనందం వెల్లివిరుస్తోంది. కొన్ని సార్లు పెట్టుబడి కూడా రాక చేలోనే పంట వదిలేసిన రైతులు ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. అంతా బాగుందనుకుంటున్న తరుణంలో టామాట రైతులకు దొంగల బాధ అధికమైంది.
అవును, టమాట ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ.. దొంగలు రెచ్చిపోతున్నారు. తమ చేతి వాటం చూపిస్తున్నారు. ప్రస్తుతం దొంగలు బంగారం, వెండి కోసం రావడం లేదు.. టమాటాలు దోచుకెళ్లడానికి వస్తున్నారు. పొలం, ఇల్లు ఇలా ఎక్కడ టమాటా కనిపించినా వాటిని దోచుకెళ్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని ఓ రైతు తన పొలం నుంచి కోసుకొచ్చిన 400 కేజీల టమాటాలను రాత్రి ఇంటి బయట ఉన్న వాహనంలో ఉంచాడు. తెల్లారి చూసే సరికి ఆ సరకు మాయమైంది. ఒక్క కాయ కూడా కనిపించలేదు. అంతా దొంగల పాలైంది. దీంతో అతడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇలా దేశవ్యాప్తంగా టమాలు దొంగతలు పెరిగిపోవడంతో రైతులు అలర్ట్ అవుతున్నారు. చేతికి వచ్చిన పంటను మంచి రేటుకు అమ్ముకుందామనుకునే రైతులు.. ఎక్కడ దొంగలు ఎత్తుకెళ్తారో అని రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు.
ఇటీవల కర్ణాటకలోని మైసూరు జిల్లాకు చెందిన ఇద్దరు రైతు సోదరులు.. పొలంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం 2 సీసీటీవీ కెమెరాలు అమర్చి.. వారి మొబైల్ ఫోన్లకు కనెక్ట్ చేసుకున్నారు. దీని ద్వారా పొలంలో ప్రతి కదలికను గమనిస్తున్నారు. ఏదైనా అనుమానస్పదంగా అనిపిస్తే వెంటనే స్పందిస్తున్నారు. మొత్తంగా జనాలే కాదు.. పండించిన రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.. ఎలా కొనాలో తెలియక జనాలు ఇబ్బందులు పడుతుంటే.. ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు టెన్షన్ పడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి