Watch Video: క్రికెటర్ కావాలనుకుంటే.. అనుకోని ప్రమాదం క్రీడా మంత్రిని చేసింది.. ఆయనెవరో గుర్తుపట్టారా?
Minister Vakiti Srihari Journey: క్రికెట్ చూడగానే పోయిన ప్రాణం మళ్లీ తిరుగొచ్చినట్టుంటుంది.. ప్యాడ్స్ కట్టుకుంటే ఇప్పటికీ మంచిగ అడగలుగుతా.. నా దగ్గర ఆ ఆట ఉంది. కానీ బ్యాటు పట్టే శక్తి లేదు" అంటూ భావోద్వేగమైన స్పీచ్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. తన జీవితంలో జరిగిన విషాదకోణాన్ని జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులతో పంచుకున్నారు. ఒక్క చిన్న సంఘటనతో జరిగే జీవితకాల నష్టాన్ని వివరించి.. వారికి జాగ్రత్తలు, సూచనలు చెప్పారు.

మొదటిసారే ఎమ్మెల్యే గెలిచి.. ఆ వెంటనే మంత్రి పదవి చేపట్టిన మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ప్రస్థానం ఎంతో ఆసక్తి కరంగా ఉంది. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన తన ప్రస్థానం గురించి చెప్పుకొచ్చారు. పాలమూరు జిల్లాలోని మక్తల్‌లో పుట్టి.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకొని, జాతీయ స్థాయిలో రంజీ ప్లేయర్‌గా ఆయన ఎదిగిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది. కానీ ఒక చిన్న రోడ్డు ప్రమాదం ఆయన క్రికెట్ కలను చిదిమేసిందని ఆయన చెప్పుకొచ్చారు.
యువకుడిగా ఉన్నప్పుడు మంత్రి వాకిటి శ్రీహరి క్రికెట్ బాగా ఆడేవారట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంచి సరైన అవకాశాలు రాలేదు. దీంతో క్రికెట్ పై ఉన్న మక్కువతో మహారాష్ట్రలోని పుణేకు వెళ్లారు. 1992-1994 మధ్య కాలంలో మహారాష్ట్ర జట్టు తరఫున రంజీ జట్టులో ఆడేవాడు. ఆయన ప్రతిభను గుర్తించి అక్కడి ప్రభుత్వం ఉద్యోగం సైతం ఇచ్చిందట. నాడు శివాజీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లో అజిత్ వాడేకర్, అనిల్ కుంబ్లే, అజాహరుద్దీన్, జవగళ్ శ్రీనాథ్ వంటి ప్లేయర్స్ ఆయనకు సీనియర్ గా ఉండేవారట. అద్భుతమైన పేస్ బౌలర్ గా రాణిస్తూ.. సీనియర్లకు ధీటుగా ఆడేస్థాయికి ఆయన ఎదిగారు.

Wakiti Srihari’s Journey From Ranji Cricketer To Minister
అయితే 1997లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం శ్రీహరి క్రికెటర్ కలను చిదిమేసి.. ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. తన జావా హెచ్ డీ బైక్ పై మక్తల్ కు వస్తుండగా కోడూరు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాదారుడి తప్పిదం కారణంగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మంత్రి వాకిటి శ్రీహరి సర్వేకల్ దెబ్బతిన్నది. ఈ ప్రమాదంతో ఆయన మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగుపెట్టలేదు. ఎందరో వైద్యుల వద్దకు వెళ్లినా ఫలితం లేకపోయిందట. కొన్ని ఏళ్లపాటు మానసిక వేదనకు గురైనట్లు విద్యార్థులకు ఆయన తెలిపారు. చిన్న పొరపాట్లు జీవితాన్నే మార్చేస్తాయని.. విద్యార్థులు జాగ్రత్తగా ఉంటూ లక్ష్యాల వైపు సాగాలని తన జీవితాన్ని ఉదహరిస్తూ వారిలో స్ఫూర్తి నింపారు. మంత్రి వాకిటి శ్రీహరి జీవితంలోని విషాదకోణాన్ని విన్న విద్యార్థులు, ఆయన అనుచరులు, అధికారులు, సిబ్బంది అంతా భావోద్వేగానికి గురయ్యారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
