AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రకృతి నేస్తాలు ఈ గణనాథులు.. ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తున్న ప్రత్యేక సంప్రదాయం

నిర్మల్ డివిజన్‌లో కర్ర గణపతులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఒకే ఊరు - ఒకే గణపతి ఆదర్శంగా నిలుస్తోంది. నినాదం ఈ గ్రామాలలోని కర్ర గణనాథుల సంప్రదాయం కేవలం భక్తికి మాత్రమే పరిమితం కాకుండా, ప్రజల మధ్య ఐకమత్యాన్ని, ఆధ్యాత్మిక విశ్వాసాన్ని పెంచుతూ, ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వాన్ని చాటుతోంది.

Telangana: ప్రకృతి నేస్తాలు ఈ గణనాథులు.. ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తున్న ప్రత్యేక సంప్రదాయం
Unique Karra Ganapathi Idols Of Nirmal
Naresh Gollana
| Edited By: |

Updated on: Aug 27, 2025 | 1:07 PM

Share

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సంప్రదాయం వెల్లివిరుస్తోంది. సుమారు 7 దశాబ్దాల క్రితం మహారాష్ట్రలోని పాలాజ్ గ్రామంలో వెలసిన ‘కర్ర గణనాథుడు’ నిర్మల్ జిల్లాలోని ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. పాలాజ్ కర్ర గణపతి స్ఫూర్తితో, నిర్మల్ జిల్లా బైంసా డివిజన్‌లోని పలు గ్రామాలు అదే ఆకృతిలో కర్ర గణపయ్యలను ప్రతిష్ఠించుకుని, వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్, భైంసా మండలం మాటేగాం, తానూర్ మండలం భోసి గ్రామాలు ఈ కర్ర గణనాథులకు చిరునామాలుగా నిలిచాయి. దశాబ్దాలుగా ఈ గ్రామాలు ‘ఒకే ఊరు, ఒకే వినాయకుడు’ అనే నినాదాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నాయి.

భోసిలో 150 మంది ప్రభుత్వ ఉద్యోగులు:

తానూర్ మండలంలోని భోసి గ్రామంలో పాలాజ్ స్ఫూర్తితో 1963లో కర్ర వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఇక్కడ వినాయకుడిని పూజిస్తే ఎలాంటి రోగాలు రావని, కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. గ్రామస్తులంతా కలిసి ఒకే గణనాథుడిని పూజించడం వల్ల ఐకమత్యం పెరిగి, సామూహిక హారతిలో పాల్గొంటున్నారు. ఈ గ్రామంలో మరో అద్భుతమైన విషయం ఉంది. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు ఉన్నప్పటికీ, కర్ర గణనాథుడిని ప్రతిష్ఠించినప్పటి నుండి ఏటా ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ గ్రామంలో 150 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇది ఆ విఘ్నేశ్వరుని ప్రసాదంగా ప్రజలు భావిస్తున్నారు.

అబ్దుల్లాపూర్‌లో ఐకమత్యానికి ప్రతీక:

భోసి తరహాలోనే, లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలో 1982 నుండి కర్ర గణపయ్యను ప్రతిష్ఠించుకుంటున్నారు. 2500 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ‘ఒకే ఊరు, ఒకే గణపతి’ అనే నినాదంతో నవరాత్రులను ఘనంగా జరుపుకుంటారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు రాజకీయాలు, పార్టీలకు అతీతంగా అందరూ ఒకే మాట, ఒకే బాటగా నిలిచి, ఒకే చోట పూజలు చేస్తారు.

మాటేగాంలో ‘కొరడి గణపతి’ ఆవిర్భావం

భైంసా మండలంలోని మాటేగాం గ్రామంలో 2017లో ‘కొరడి గణపతి’ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం ఆవిర్భావం కూడా ఒక అద్భుతం. గ్రామానికి చెందిన ప్రకాష్ పటేల్ తన వ్యవసాయ భూమిలోని చెట్లను వేర్లతో సహా తీయించి ఇంటి ఆవరణలో ఉంచాడు. అయితే పిల్లలు ఆ వేర్లలో వినాయకుడి ఆకారాన్ని పోలి ఉన్న రూపాన్ని గమనించి గ్రామస్తులకు తెలియజేశారు. వేద పండితులు దానిని కొరడి గణపతిగా నామకరణం చేసి ఆలయాన్ని నిర్మించారు. ఏటా వినాయక చవితి రోజున ప్రతిష్ఠించి 11 రోజుల పాటు నవరాత్రులు జరుపుకుంటారు. ఉత్సవాలు పూర్తయ్యాక ఉరేగింపుగా తీసుకెళ్లి గంగనీళ్లతో నిమజ్జనం చేసి, తిరిగి గర్భగుడిలో ఉంచుతారు. ప్రస్తుతం ఈ కొరడి గణనాథుడిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు బారులు తీరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..