AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: టీచర్ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన స్టూడెంట్స్.. అసలు ఏం జరిగిందంటే..?

తల్లిదండ్రుల తర్వాత ప్రత్యక్ష దైవం గురువు అని చెబుతారు. విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో టీచర్లది కీలక పాత్ర. ఇలా విద్యార్థులకు ఉపాధ్యాయులతో ఏర్పడిన బలమైన అనుబంధం ఇంకా ప్రత్యేకమైనది. కొందరి టీచర్లతో పిల్లలకు ప్రత్యేక అనురాగం, ప్రేమాభిమానాలు ఉంటాయి. వారు స్కూల్ వదిలి పోతుంటే తట్టుకోలేరు.

Telangana: టీచర్ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన స్టూడెంట్స్.. అసలు ఏం జరిగిందంటే..?
Teacher's Transfer Leaves Childrens Heartbroken
M Revan Reddy
| Edited By: |

Updated on: Aug 27, 2025 | 1:34 PM

Share

విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య ఉండే బంధం ఎంతో గొప్పది. తల్లిదండ్రుల తర్వాత గురువునే ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. అలాంటి బంధానికి ప్రతీకగా నిలిచే సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. తమకు విద్యాబుద్ధులు నేర్పిన టీచర్ బదిలీపై వెళ్తుండగా, విద్యార్థినిలు ఆమెను వీడి ఉండలేక కన్నీటి పర్యంతమయ్యారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) ప్రాథమిక పాఠశాలలో ఏడేళ్లుగా ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న వనజ టీచర్, తనదైన శైలిలో విద్యాబోధన చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనసులను గెలుచుకున్నారు. పిల్లలను సొంత బిడ్డల మాదిరి చూసుకుంటూ, వారికి చదువుతో పాటు మంచి నడవడికను నేర్పించారు.

వీడ్కోలు సమావేశంలో భావోద్వేగం..

ఇటీవల ప్రభుత్వం ఉపాధ్యాయులకు కల్పించిన పదోన్నతుల్లో భాగంగా వనజ టీచర్ మోతే మండలం నామవరం ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. దీంతో పాఠశాలలో ఆమెకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం వనజ టీచర్ అక్కడి నుంచి బయలుదేరుతుండగా.. ఆమెను చూసి విద్యార్థినిలు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. తమను వదిలి వెళ్ళవద్దంటూ టీచర్‌ను అడ్డుకున్నారు. పాఠశాల గేటుకు అడ్డంగా నిలబడి గట్టిగా ఏడ్చేశారు.

చిన్నారుల అమాయకమైన ప్రేమ, వారి కళ్లలో కనిపించిన బాధను చూసి టీచర్ వనజ కూడా కన్నీటిని ఆపుకోలేకపోయారు. ఉబికి వస్తున్న కన్నీళ్లతోనే పిల్లలను ఓదార్చి, మనసులో భారంతో అక్కడి నుంచి వీడ్కోలు పలికారు. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి హృదయం కరిగిపోయింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు మధ్య ఉండే అపురూపమైన బంధానికి ఈ సంఘటన మరోసారి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..