Telangana: రూ.లక్షకు 14వేలు.. అందరూ ప్రభుత్వ ఉద్యోగులే..! యూబిట్ దందాపై రంగంలోకి దిగిన ఈడీ..
నిర్మల్ జిల్లాలో యూబిట్ దందా మళ్లీ టెన్షన్ పెడుతోంది. ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ స్కామ్‌లో పాత్ర ఉన్నవారిలో వణుకు పడుతోంది. యూబిట్ కేసు వివరాలు ఇవ్వాలని నిర్మల్ పోలీసులకు ఈడీ లేఖ రాయడం సంచలనంగా మారింది.
నిర్మల్ జిల్లాను యూబిట్ దందా కేసులు వణికిస్తున్నాయి. ఈ దందాకు సంబంధించి ఇప్పటికే పలువురు ఉపాధ్యాయులు అరెస్ట్ అయి.. బెయిల్ విడుదల కాగా.. ఇప్పుడు ఈడీ కూడా దృష్టి పెట్టడం హాట్‌టాపిక్‌గా మారుతోంది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున మనీలాండరింగ్ పాల్పడినట్టు గుర్తించిన ఈడీ.. అడ్డదారిలో కోట్లు కొల్లగొట్టిన ముఠా కార్యకలాపాలపై ఆరా తీస్తోంది. దానిలో భాగంగా.. నిర్మల్ పోలీసులకు ఈడీ లేఖ రాసింది. ఎఫ్ఆర్, రిమాండ్ రిపోర్ట్, నిందితుల బ్యాంకు ఖాతాల వివరాలు సమర్పించాలని నిర్మల్ ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. నిర్మల్ యూబిట్ వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఈడీ.. దర్యాప్తు చేపట్టింది.
యూబిట్ యాప్‌లో 250 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు పెట్టుబడులు పెట్టినట్టు ఆధారాలు సేకరించింది. సుమారు 50 కోట్ల రూపాయల వరకు చేతులు మారినట్టు గుర్తించింది. మరోవైపు.. ఈ స్కామ్‌పై కేసు నమోదు చేసి 8మంది టీచర్లను నిర్మల్ పోలీసులు రిమాండ్‌కు తరలించగా.. బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. పలువురు ఉపాధ్యాయులను నిర్మల్ డీఈవో సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో.. స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులకు కూడా కీలక ఆధారాలు లభించాయి. లక్షకు 14వేలు ఇస్తామని చెప్పి యాప్ ద్వారా మోసానికి పాల్పడినట్లుగా గుర్తించారు.
అంతేకాదు.. ఈ కేసులో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లా ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని బ్రిజ్ మోహన్ అనే వ్యక్తి దుబాయ్ నుంచి ఆపరేట్ చేసినట్టు తేల్చారు నిర్మల్ పోలీసులు. ప్రధాన నిందితుడి భావించి.. అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే.. నిర్మల్ జిల్లా యూబిట్ స్కామ్ కేసుపై ఈడీ దృష్టి సారించడం సంచలనంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..