AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఆ పరిశోధనతో నోబెల్ సాధిస్తే.. రూ. 100 కోట్లు మీవే.. సీఎం చంద్రబాబు మెగా ఆఫర్

ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం. క్వాంటం టెక్నాలజీ ద్వారా ఈ ఘనత ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వంద కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Andhra: ఆ పరిశోధనతో నోబెల్ సాధిస్తే.. రూ. 100 కోట్లు మీవే.. సీఎం చంద్రబాబు మెగా ఆఫర్
Chandrababu
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Dec 23, 2025 | 1:57 PM

Share

ఏపీని భారత్‌లోనే క్వాంటం టెక్నాలజీ విప్లవానికి నాయకత్వం వహించే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏపీ ప్రభుత్వం, వైసర్, క్యూబిట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న క్వాంటం ప్రోగ్రామ్‌లో భాగంగా ‘క్వాంటం టాక్ బై సీబీఎన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్వాంటం టెక్నాలజీకి సంబంధించి ఇప్పటివరకు నిర్వహిస్తున్న అతిపెద్ద శిక్షణా కార్యక్రమంలో డిజిటల్ మాధ్యమం ద్వారా వేల మంది టెక్ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి క్వాంటం ప్రోగ్రామ్‌కు నమోదు చేసుకున్న విద్యార్థులతో పాటు వివిధ ఇంజినీరింగ్, టెక్నాలజీ కళాశాలల ప్రొఫెసర్లు, అమెరికా నుంచి వైసర్ సంస్థ ప్రతినిధులు, క్యూబిట్, ఐబీఎం సంస్థల నిపుణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్వాంటం టెక్నాలజీలో నైపుణ్యాలే భవిష్యత్ సంపదగా మారతాయని చంద్రబాబు తెలిపారు.

10 లక్షల మంది నిపుణులను తయారుచేయడమే లక్ష్యం

క్వాంటం మెకానిక్స్, అల్గారిథమ్స్‌లో 10 లక్షల మంది నిపుణులను, క్వాంటం సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాల్లో 3 లక్షల మందిని, అడ్వాన్స్‌డ్ రీసెర్చ్‌లో మరో లక్ష మంది నిపుణులను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ దిశగా అమరావతిలో క్వాంటం వ్యాలీ ద్వారా పూర్తి ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఐటీ విప్లవాన్ని ముందుగానే అందిపుచ్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ నిపుణులను తయారు చేసి ప్రపంచానికి అందించామని సీఎం గుర్తు చేశారు. సైబరాబాద్ నిర్మాణంతో హైదరాబాద్ ఐటీ గ్లోబల్ హబ్‌గా ఎదిగిందన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలకు భారతీయులే నాయకత్వం వహిస్తున్నారని, విశాఖలో గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు కానుందని చెప్పారు.

విశాఖ ఇప్పుడు డేటా హబ్

విశాఖ ఇప్పుడు డేటా సెంటర్లకు గ్లోబల్ హబ్‌గా మారుతోందని, సబ్‌సీ కేబుల్ వ్యవస్థ కూడా అక్కడి నుంచే ఏర్పాటు కానుందని వివరించారు సీఎం చంద్రబాబు. అమరావతి నాలెడ్జ్ ఎకానమీగా, క్వాంటం వ్యాలీగా ఎదుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుపతిని స్పేస్ సిటీగా, అనంతపురం–కడప ప్రాంతాలను ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, బెంగళూరు–హైదరాబాద్ కారిడార్లు దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక కారిడార్లుగా మారుతున్నాయన్నారు. క్వాంటంతో పాటు ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా కూడా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. వైద్యం, విద్యుత్, సుస్థిర వ్యవసాయం, ఫైనాన్షియల్ మోడలింగ్, మెటీరియల్స్ డిస్కవరీ, వాతావరణ అంచనాల వంటి రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ మానవాళికి విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని సీఎం చెప్పారు. ఏఐ, క్వాంటం, శాటిలైట్, డ్రోన్ వంటి సాంకేతికతలతో తక్కువ వ్యయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉందన్నారు.

మన పరిశోధనలు నోబుల్ స్థాయికి వెళ్లాలి

మన పరిశోధనలు నోబెల్ స్థాయికి చేరేలా క్వాంటం టెక్నాలజీ ఉపయోగపడాలని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌తో కూడిన ఎకోసిస్టమ్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యక్తిగత ఔషధాలు, ప్రివెంటివ్, క్యురేటివ్ హెల్త్ రంగాల్లో క్వాంటం అప్లికేషన్ల ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చన్నారు. వచ్చే రెండేళ్లలో క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను కూడా అమరావతి నుంచే తయారు చేయాలన్నది లక్ష్యమని చెప్పారు. క్వాంటం ప్రోగ్రామ్ ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చిందని, ఒక్క ప్రకటనతోనే 54 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని సీఎం వెల్లడించారు. లక్ష మంది క్వాంటం నిపుణులను తయారు చేయాలన్న లక్ష్యంతో స్కిల్ రోడ్‌మ్యాప్ సిద్ధం చేశామని తెలిపారు. ఏ సాంకేతికత అయినా, ఏ విప్లవమైనా ఏపీ నాయకత్వం వహిస్తుందని, అనుసరించదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ తిరుపతి డైరెక్టర్లు, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి సహా వివిధ సంస్థల నిపుణులు పాల్గొన్నారు. క్వాంటం టెక్నాలజీ ప్రోగ్రామ్‌ను సమర్థంగా నిర్వహిస్తున్న ఐటీ శాఖ అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు.