Telangana: పైకి చూసి బంగారం కొంటారనుకుంటే పొరపాటే.. అసలు యాపారం తెలిస్తే బిత్తరపోతారు
అచ్చంపేటలో ఘరానా మహిళా దొంగల ఆటకట్టించారు పోలీసులు. బురఖాలు ధరించి దోపిడీకి పాల్పడిన ఇద్దరు మహిళలను రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.. మీరూ ఓసారి లుక్కేయండి.

అచ్చంపేట పట్టణంలోని టీచర్స్ కాలనీలో మల్ రెడ్డి రామకృష్ణ దంపతులు న్యూ ఎక్సీడ్ స్కూల్‌పైన కిరాయికి నివసిస్తున్నారు. గత నెల 16వ తేదిన సాయంత్రం 7.00 గం.ల సమయంలో మల్రెడ్డి రామకృష్ణ వ్యక్తిగత పని మీద బయటికి వెళ్ళాడు. ఆ సమయంలో ఇంట్లో భార్య ఒక్కతే ఉంది. అయితే బురఖాలు ధరించి ముఖం, శరీర భాగాలు కనిపించకుండా ఉన్న ఇద్దరు మహిళలు వారి నివాసానికి వచ్చారు. రూమ్ అద్దెకు ఇస్తారా అని అడిగి మాటలు కలిపారు. అనంతరం కాస్త మంచినీళ్లు ఇవ్వరా తాగడానికి దాహం వేస్తోందని నమ్మబలికారు. నీరు తీసుకురావటానికి రామకృష్ణ భార్య ఇంట్లోకి వెళ్ళగా ఆమెను అనుసరిస్తూ వెనకాలే వెళ్ళారు. ఇంతలోనే వెనకవైపు నుంచి ఆమెను గట్టిగా పట్టుకొని నోరుమూసి.. ఆ మెడలోని బంగారు పుస్తెలతాడు, బంగారు నల్లపూసల దండ, చేతులకు ఉన్న బంగారు ఉంగరాలు ఆమె కాళ్ళకు ఉన్న ఒక జత వెండి పట్టీలు దోపిడీ చేశారు.
అచ్చంపేటలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అచ్చంపేట సీఐ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి ఇద్దరు మహిళా దొంగల కోసం గాలింపు చేపట్టారు. అయితే దొంగిలించిన సొమ్మును అమ్ముతుండగా కిలేడీలు పట్టుబడ్డారు. నిందితుల్లో ఒకరైన అశ్విని ఈ రోజు పాత బస్టాండ్ సమీపంలోని బంగారు షాపునందు దొంగిలించిన సొత్తు అమ్ముతుండగా పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. అనంతరం స్టేషన్‌కి తీసుకొచ్చి విచారించగా.. తాను చేసిన నేరం ఒప్పుకుంది.
ఇక అశ్విని ఇచ్చిన సమాచారం మేరకు మరో దొంగ చాపల శ్రావణి అలియాస్ మండ్ల స్వాతిని అదుపులోకి తీసుకున్నారు. A1గా ఉన్న అశ్విని అచ్చంపేటలోనే టైలర్‌గా పనిచేస్తుండగా… A2 చాపల శ్రావణి అలియాస్ మండ్ల స్వాతి హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో గృహిణిగా ఉంటోంది. ఇక వీరి వద్ద నుంచి బంగారు పుస్తెలతాడు, బంగారు నల్లపూసల దండ, బంగారు ఉంగరాలు, ఒక జత వెండి పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు పోలీసులు.