AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఊపందుకున్న నామినేషన్ల పర్వం.. ఇవాళ బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో..!

కరీంనగర్‌ నుంచి పోటీ చేస్తున్న BRS అభ్యర్థి గంగుల కమలాకర్ నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు.. మూడు సార్లు అవకాశం ఇస్తే కరీంనగర్ రూపు రేఖలు మార్చాను.. నాలుగోసారి గెలిపిస్తే పదివేల మందికి ఉపాధి చూపే ప్రాజెక్టులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు గంగుల.

Telangana: ఊపందుకున్న నామినేషన్ల పర్వం.. ఇవాళ బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో..!
Telangana Nominations
Ravi Kiran
|

Updated on: Nov 08, 2023 | 3:37 PM

Share

కరీంనగర్‌ నుంచి పోటీ చేస్తున్న BRS అభ్యర్థి గంగుల కమలాకర్ నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు.. మూడు సార్లు అవకాశం ఇస్తే కరీంనగర్ రూపు రేఖలు మార్చాను.. నాలుగోసారి గెలిపిస్తే పదివేల మందికి ఉపాధి చూపే ప్రాజెక్టులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు గంగుల. మేడ్చల్‌ నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి కీసరలో ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసులో నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేశారు. మేడ్చల్‌ నుంచి భారీ మెజార్టీతో మళ్లీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ సాధనలో కేసీఆర్‌ అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు.

ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్ధిగా దానం నాగేందర్ భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేసారు. తన అనుచరులతో, కార్యకర్తలతో ఉత్సాహంగా వచ్చిన దానం గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. తాను విజయం సాధిస్తే నియోజకవర్గంలోని మురికివాడలకు మౌలిక సదుపాయాలు కలుగజేస్తానని దానం నాగేందర్‌ హామీ ఇచ్చారు. నాగర్‌కర్నూల్‌జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు, కాంగ్రెస్ అభ్యర్ధి వంశీకృష్ణ నామినేషన్‌ దాఖలు చేశారు. ఇద్దరు ఒకే సమయానికి రిటర్నింగ్‌ ఆఫీస్‌ వద్దకు రావడంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గో బ్యాక్‌ అంటూ ఇరుపార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలకు దిగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.

సనత్‌నగర్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే మర్రిశశిధర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. సికింద్రాబాద్‌ జీహెచ్‌ఎంసీ కార్యాయంలో ఆయన రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు మర్రి శశిథర్‌రెడ్డి. సనత్‌నగర్‌లో ఈసారి కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారాయన. వరంగల్‌జిల్లా నర్సంపేటలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వచ్చి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. అటు సిద్దిపేటజిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. సెంటిమెంట్‌గా హుస్నాబాద్‌ను వాడుకొని, అభవృద్ది మాత్రం గజ్వేల్‌, సిద్దిపేటలో చేస్తున్నారని మండిపడ్డారు పొన్నం ప్రభాకర్‌.

ఖమ్మంజిల్లా పాలేరు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కొందరు వ్యక్తులు డబ్బు మదంతో ఆత్మగౌరవాన్ని కొనాలని చూస్తున్నారని..కానీ అది ఎప్పటికీ జరగనిపని అన్నారు కందాల. సీపీఎం పోటీతో త్రిముఖ పోటీ ఉండవచ్చని సంబంధంలేని వ్యక్తులు ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాలేరు ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఈ సందర్బంగా ఓటర్లకు పిలుపునిచ్చారు కందాల ఉపేందర్‌రెడ్డి. రంగారెడ్డిజిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా అందే బాబయ్య నామినేషన్‌ దాఖలు చేశారు. కేంద్రమంత్రి సర్వానంద్‌ సోనోవాల్‌తోపాటు కార్యకర్తలు, అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చిన అందె బాబయ్య..ఆర్డీవో ఆఫీసులో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. శేరిలింగంపల్లి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అరికెపూడి గాంధీ నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. నియోజకవర్గంలో ప్రజా సంక్షేమ పథకాలే తనను మళ్లీ గెలిపిస్తాయని అరికెపూడి గాంధీ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ను మరోసారి గెలిపిస్తే హ్యాట్రిక్‌ సీఎంగా కేసీఆర్‌ మరింత అభివృద్ది చేస్తారని అన్నారు గాంధీ.