Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల వేడి.. నేతల పనితీరుపై మాణిక్‌రావు థాక్రే సీరియస్
Telangana Congress News: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తుండటంతో స్పీడ్ పెంచింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలు సమీపిస్తున్నా.. పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పనితీరు సరిగా లేదని AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Congress News: తెలంగాణలో అసలు సిసలైన అసెంబ్లీ పోరుకు నాలుగైదు నెలలే సమయం ఉండటంతో.. గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల హడావిడి క్రమంగా పెరుగుతోంది. సమావేశాలు.. సమీక్షలు.. నేతల పనితీరు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. PCC ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో AICC ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే సమావేశం అయ్యారు. బూత్ లెవల్ నుంచి హైదరాబాద్ వరకు కాంగ్రెస్ పార్టీ పటిష్ఠానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు నాయకులు. మండల కమిటీల ఏర్పాటుకు ఈ నెల 16ను డెడ్‌లైన్‌గా విధించారు. ఇన్నాళ్లూ AICC కార్యదర్శుల హోదాలో తెలంగాణలో పార్టీ వ్యవహారాలు చూసిన బోసురాజు, నదీం జావెద్ ఆ బాధ్యతల నుంచి విముక్తి కావడంతో వారికి సమావేశంలో అభినందనలు తెలిపారు. కర్నాటకలో కాంగ్రెస్‌ను విజయ తీరాలకు చేర్చిన టీమ్‌లో కీలకంగా ఉన్న AICC కార్యదర్శులు విష్ణునాదన్, మన్సూర్ అలీ ఇకపై తెలంగాణలో కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షించబోతున్నారు.
నేతల పనితీరుపై మాణిక్‌రావు థాక్రే సీరియస్
ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పనితీరుపై మాణిక్‌రావు థాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటించకపోతే ఎలా అని ప్రశ్నిస్తూనే.. ఎన్నికల సమయంలో ప్రజల్లోనే ఉండాలని హితవు పలికారు. పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పనితీరు సరిగా లేదని, ఇప్పటికైనా మార్చుకోవాలంటూ AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పనితనంతోనే టికెట్ల కేటాయింపు..
పనితనంతోపాటు సర్వేల ప్రాతిపదికగానే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఉంటుందని కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. కర్నాటక ఫలితాలే తెలంగాణలోనూ రిపీట్ అవుతాయని ఆశాభవం వ్యక్తం చేశారు నాయకులు.
భట్టికి అభినందనలు..
సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకోవడంతో.. గాంధీభవన్‌లో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. బాణాసంచా పేల్చి మాణిక్‌రావు థాక్రేతో కేక్ కటింగ్ చేయించారు. పార్టీ సమావేశంలోనూ భట్టివిక్రమార్కకు అభినందనలు తెలియజేశారు నాయకులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..