Munugode By Poll: మునుగోడు లెక్క తేలింది.. బరిలో నిలిచింది ఎంతమందంటే.. ప్రధాన పోటీ వీరి మధ్యే..
మునుగోడు బరిలో 47 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికి ప్రధాన పోటీ మాత్రం టీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి స్థానికంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం లేనప్పటికి.. కాంగ్రెస్ పార్టీకి..

తెలంగాణ రాజకీయం మొత్తం మునుగోడు చుట్టూ తిరుగుతోంది. నవంబర్ 3వ తేదీన మునుగోడు శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. అయితే బరిలో నిలిచిన వారి లెక్క తేలింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు అక్టోబర్ 17వ తేదీ సోమవారం తో ముగియడంతో.. అధికారులు పోటీలో ఉన్నవారి జాబితా ప్రకటించారు. మొత్తం 130 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. అధికారులు 47 నామపత్రాలు చెల్లినవిగా పరిగణించి తిరస్కరించారు. మరో 36 మంది నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో 47 మంది పోటీలో నిలిచారు. వీరిలో టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, బీఎస్పీ, ప్రజాశాంతి పార్టీతో పాటు మరికొన్ని ప్రాంతీయ పార్టీలతో పాటు స్వతంత్య్ర అభ్యర్థులు ఉన్నారు. తొలుత 130 మంది అభ్యర్థులు 199 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, వివిధ కారణాలతో అధికారులు 47 నామపత్రాలను తిరస్కరించారు. దీంతో నామినేషన్ల పరిశీలన పూర్తైన తర్వాత 83 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి మరో 36 మంది తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు. టీఆర్‌ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి, బీఎస్పీ తరపున ఆందోజు శంకరచారి పోటీలో ఉన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతో 13 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఆదివాం పది మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా.. సోమవారం మరో ముగ్గురు తమ నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. వీరంతా టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. మునుగోడు బరిలో మిగిలింది ఎంతమంది అనేదానిపై క్లారిటీ రావడంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
మునుగోడు బరిలో 47 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికి ప్రధాన పోటీ మాత్రం టీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి స్థానికంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం లేనప్పటికి.. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంతో.. ఆ పార్టీ ప్రధాన పోటీదారుగా మారింది. టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలకు క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉండటంతో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే నియోజకవర్గంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పట్టు ఉండటంతో పాటు, ప్రజల్లో బీజేపీ అభ్యర్థిపై సానుభూతి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇలా ఉండగా టీఆర్ ఎస్ పార్టీలో చాలామంది స్థానిక నేతలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వంపై వ్యతిరేకతతో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే పార్టీ సీనియర్ నేతలు, మంత్రల స్థాయి నాయకులు స్థానిక నేతలను బుజ్జగించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల మధ్య మునుగోడు ఫలితం ఎలా ఉంటుందనేది నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపుతో తేలనుంది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..