Munugode By Poll: ఆయన మాటలు నమ్మొద్దు.. మునుగోడు ప్రచారంలో ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..
సీఏం సొంత నియోజకవర్గంలో కోట్ల రూపాయలు ఖర్చుపెడుతూ.. తమ నియోజకవర్గానికి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించడం రాజగోపాల్ రెడ్డి చేసినా తప్పా అని ప్రశ్నించారు ఈటల రాజేందర్. ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వకుండా సీఏం కేసీఆర్ తెలంగాణ యువతను మోసం చేశారని..
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారాన్ని ముమ్మరం చేశాయి రాజకీయ పార్టీలు. నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగియడంతో ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచాయి పొలిటికల్ పార్టీలు. టీఆర్ ఎస్, బీజేపీ నాయకులు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. ఇరు పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రంలో బీజేపీపై టీఆర్ ఎస్, రాష్ట్రంలోని టీఆర్ ఎస్ పై బీజేపీ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా అక్టోబర్ 17వ తేదీ సోమవారం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకె.అరుణ వేర్వేరుగా మునుగోడు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాంపల్లి మండలం పసునూరి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్ సీఏం కేసీఆర్ పై మండిపడ్డారు. ఒక్క రాజగోపాల్ రెడ్డి మీద ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు దాడి చేస్తున్నారన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఇక్కడ అడ్డాపెట్టి ఓడించాలని చూస్తున్నారని, 80 నుంచి 90 మంది ఎమ్మెల్యేలను గ్రామ గ్రామానికి కేటాయించారన్నారు. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీలో బాగా కొట్లాడుతున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, అందుకే ఆయన గొంతు నొక్కాలని అధికార టీఆర్ ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
రాజగోపాల్ రెడ్డి గొంతు అసెంబ్లీలో వినిపించకుండా చేయడం కోసం హైదరాబాదులో అక్రమంగా సంపాదించుకున్న వేల కోట్ల రూపాయలు మునుగోడుకు తీసుకొచ్చారని సంచలన ఆరోపణలు చేశారు ఈటల రాజేందర్. ప్రభుత్వ వద్ద ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, మహిళా సంఘాల రుణాలకు వడ్డీలు ఇవ్వడానికి డబ్బులు లేవు, డబుల్ బెడ్ రూమ్ కట్టడానికి డబ్బులు లేవు, కానీ వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి వాటిని ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. పసునూరు గ్రామానికి కూడా స్వయంగా మంత్రులే డబ్బులు తీసుకొచ్చి ఎమ్మెల్యేలతో పంచిపెట్టే దుస్థితికి ఎందుకు దిగజారారని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు ఉంటాయి పోతాయని, అయితే కొంతమందికి గ్రామాల్లో చదువు రాకపోవచ్చు, మారుమూల ప్రాంతాల వారు టీవీలు చూడకపోవచ్చని, కానీ ఆడబిడ్డలు నలుగురు కలిసిన దగ్గర, సద్దులు తినే దగ్గర, కలుపులు తీసే దగ్గర, చెట్టు కింద కూర్చున్న దగ్గర అనేక విషయాలు మీద మాట్లాడుకుంటున్నారని, మునుపటి లెక్క ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదన్నారు. ప్రతి ఇంట్లో ఒక చదువుకున్న అబ్బాయి, అమ్మాయి ఉంటారని, ప్రతి వ్యక్తి చేతిలో మొబైల్ ఫోన్ ఉందని, సీఏం కేసీఆర్ గతంలో ఏం మాట్లాడారు, ప్రస్తుతం ఏం మాట్లాడుతున్నారో క్షణాల్లో తెలిసిపోతుందన్నారు. కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే రాజగోపాల్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కక్ష కట్టారని ఆరోపించారు.
సీఏం సొంత నియోజకవర్గంలో కోట్ల రూపాయలు ఖర్చుపెడుతూ.. తమ నియోజకవర్గానికి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించడం రాజగోపాల్ రెడ్డి చేసినా తప్పా అని ప్రశ్నించారు ఈటల రాజేందర్. ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వకుండా సీఏం కేసీఆర్ తెలంగాణ యువతను మోసం చేశారని, నిరుద్యోగ భృతి ఇస్తామని ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఈటల రాజేందర్ విమర్శించారు. రాష్ట్రంలో ఆదాయం ఎక్కువ శాతం లిక్కర్ ద్వారా వస్తుందని, సంక్షేమ పథకాల పేరుతో 25వేల కోట్ల రూపాయలు ఇచ్చి మద్యం ద్వారా 45 వేల కోట్ల రూపాయలు ప్రజల నుంచి లాక్కుంటున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మునుగోడు తీర్పు తెలంగాణ ప్రజల ఆత్మను ఆవిష్కరించే విధంగా ఉండాలని, రాజ్ గోపాల్ రెడ్డిని గెలిపించాలని ఈటల రాజేందర్ ఓటర్లను కోరారు.
తెలంగాణ ప్రజల కోసమే పదవీ త్యాగం: డీకే అరుణ
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మితో కలిసి మునుగోడు నియోజకవర్గం లోని చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. తెలంగాణ మొత్తం మునుగోడు వైపు చూస్తోందన్నారు. తెలంగాణ ప్రజలకు కోసం రాజ్ గోపాల్ రెడ్డి పదవి త్యాగం చేశారని చెప్పారు. కెసిఆర్ ఎన్నికల హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన కుటుంబాన్ని బంగారం చేసుకున్నారు తప్పు, ప్రజలకు చేసిందేమి లేదని విమర్శించారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు వచ్చి, ఉపాధి అవకాశాలు పెరిగి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందని నమ్మి టీఆర్ ఎస్ పార్టీని గెలిపిస్తే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు. రెండో సారి ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడే పుట్టింది మరో సారి అవకాశం ఇవ్వండని మరో సారి గెలిచి మోసం చేశారని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణానికి రూ.5,00,000 ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. రైతు రుణ మాఫీ అని చెప్పి రైతులను మోసం చేశారన్నారు.
దళిత బంధు అందరికీ ఇవ్వలేదన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు టీఆర్ ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి గౌరవం దక్కడం లేదన్నారు. డబ్బుతోనే కేసీఆర్ ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. సీఏం కేసీఆర్ కు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి బీఆర్ ఎస్ పేరుతో ఇక్కడి ప్రజలను మోసం చేసిన ఘనత కెసిఆర్ కు దక్కుతుందని విమర్శించారు. టీఆర్ ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. మునిగిడు ఎన్నిక యూనిట్ టెస్ట్ అని మంత్రి కేటీఆర్ అన్నారు, హుజురాబాద్ లో ఫెయిల్ అయ్యారు మునుగోడు ఎన్నిక తో పాటు అంట తెలంగాణ లో కూడా కెసిఆర్ ఫెయిల్ అవుతారని డీకే అరుణ జోస్యం చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..