Telangana: చేయని పనులను కూడా బ్యానర్‌లో వేయించారు.. ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి నిరసన సెగ..
వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. తొండపల్లి గ్రామంలో ఎమ్మెల్యే చేపట్టిన పల్లెబాటను సర్పంచ్ తోపాటు గ్రామస్తులు అడ్డుకున్నారు. కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా గ్రామంలో కార్యక్రమం నిర్వహించడమే కాకుండా..
వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. తొండపల్లి గ్రామంలో ఎమ్మెల్యే చేపట్టిన పల్లెబాటను సర్పంచ్ తోపాటు గ్రామస్తులు అడ్డుకున్నారు. కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా గ్రామంలో కార్యక్రమం నిర్వహించడమే కాకుండా.. తమ గ్రామంలో చేయని పనులను కూడా బ్యానర్ లో వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోకి వచ్చిన ఎమ్మెల్యేను నిలదీసేందుకు వెళ్తున్న గ్రామస్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమకు ఎమ్మెల్యేను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేకు తమ సమస్యలను చెప్పేందుకు వెళ్తుంటే ఆయన అనుచరులు అడ్డుకుంటున్నారని.. ఫోటోలు విడియోలు తీస్తే, ఫోన్లు లాగేసుకుంటున్నారని గ్రామస్థులు వాపోయారు. తమ గ్రామంలో దాదాపు 65 లక్షల రూపాయల నిధులతో పనులు చేయించామని బ్యానర్ వేశారని.. మరి ఇన్ని నిధులు ఎక్కడ పోయాయని గ్రామస్థులు అడుగుతున్నారని సర్పంచ్ గీత ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు లేని ఈ ప్రాంతంలో తమ గ్రామానికి 20 ఎకరాల్లో సాగునీరు అందిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సర్పంచ్ విమర్శించారు.
తాము లేకుండా గ్రామ అభివృద్ధి ఎలా జరిగిందో చెప్పాలని సర్పంచ్ గీత డిమాండ్ చేశారు. సర్పంచ్ అంటే కేవలం గ్రామ కార్మికురాలిగా బాధ్యత గల ఎమ్మెల్యే చూస్తున్నారని.. ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. అటు యాబాజిగూడ గ్రామంలో కూడా గ్రామస్థులు తమ సమస్యలతో ఎమ్మెల్యే ను ఉక్కిరిబిక్కిరి చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..