Tomato Price: 2 నెలల క్రితం రోడ్లపై కుప్పలు.. ఇప్పుడేమో కొందామంటే వాతలు.. తాజా ధర తెలిస్తే షాకే
టమాటా చేదెక్కింది. ఎందుకంటే దాని ధర కొండెక్కింది. ఇప్పటికే పెరిగిన ఇంధన ధరలు సామాన్యుడికి షాకిస్తుంటే.. నేను సైతం అంటూ టమాటా వచ్చింది.
మనందరం గ్యాస్, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయ్.. కరెంటు కోతలు వస్తాయంటా అంటూ మాట్లాడుకుంటున్నాం. కాని టమాటా మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. కరెంటు కోతలు దేవుడెరుగు కాని.. అండర్ కరెంట్‌గా టమాటా రేట్స్ పీక్స్‌కు చేరుకుంటోంది. వర్షాలు, వరదలు, పంట నష్టాలతో టమాటాలతోపాటు.. కొన్ని కూరగాయల ధరలు కూడా కొండెక్కుతున్నాయి. ఆదివారం మార్కెట్లో మీరు కిలో టమాటా 40 రూపాయలకి కొనుంటారు. ఇప్పుడా ధర 50 దాటింది. చిల్లర వ్యాపారుల సంగతి చెప్పనక్కర్లేదు. ధరల పెరుగుదలకు ప్రధానం ఇటీవల కురుస్తున్న వర్షాలే కారణమని తెలుస్తోంది. పంట నష్టంతో దిగుబడులు తగ్గడంతో హైదరాబాద్ నగరానికి ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి దిగుమతి అవుతున్నాయి. ధరలు పెరిగేందుకు వర్షాలే ప్రధాన కారణమని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
నగరానికి అవసరమైన టమాటాల్లో 60 శాతం బయట రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. మిగతా 40 శాతమే మన రాష్ట్రంలో లభ్యమవుతోంది. వర్షాలు పడడంతో అమాంతం 15 శాతానికి సరఫరా పడిపోయింది. దీంతో 85 శాతం వరకు వివిధ రాష్ట్రాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తిందని వ్యాపారులు అంటున్నారు. బీన్స్, బీరకాయ, బెండ ధరలు కూడా పెరిగాయి. దసరా తర్వాత కార్తీక మాసం వస్తోంది. ఈ సమయంలో కూరగాయల ధరలు పెరిగితే ఇక ఇంట్లో వచ్చే కార్తీక దీపం సీరియల్ కన్నాముందే కన్నీళ్లు రాకతప్పవు. రెండు నెలల క్రితం టమాటా రైతుకు ధరే దక్కలేదు. కర్నూలు మార్కెట్లో అమ్ముడుపోక రోడ్లపైనే టమాటాలు, ఇతర కూరగాయలు పారబోసిన సంగతి చూశాం. ఇప్పుడు అదే టమాటా రుచి పులుపు కాదు చేదెక్కింది. ప్రస్తుతం 60రూపాయలకు చేరువకు వచ్చింది. కొన్నిరోజులాగితే సెంచరీ దాటే ప్రమాదం కూడా పొంచిఉంది. ప్రభుత్వం వెంటనే ధరలు నియంత్రణ చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు సామాన్య ప్రజలు.
Also Read: వామ్మో పెద్ద సమస్యే.. ‘కరెంట్ పోతే ‘కార్తీక దీపం’ సీరియల్ ఎలా చూడాలి ?’