Telangana: అమ్మో బెబ్బులి..! రెండు జిల్లాలను వణికిస్తున్న ఆ పులి ప్రస్తుతం ఎక్కడ ఉంది..?
ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలను బెబ్బులి బెంబేలెత్తిస్తోంది. వెంకటాపురం, మంగపేట, తాడ్వాయి మండలాలను హడలెత్తిపోయేలా చేస్తోంది. మరోవైపు పులి ప్రాణాలు కాపాడడం కోసం అటవీశాఖ చర్యలు చేపడుతుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొద్దిరోజుల క్రితం కలకలం సృష్టించిన పెద్దపులి తాజాగా ములుగు జిల్లాలో ప్రత్యక్షమైంది. వెంకటాపురం మండలంలోని భోదపురం, ఆలుబాక, తిప్పాపురం, సీతారాంపురం, రామచంద్రపురం గ్రామ పరిసరాల్లో పులి గాండ్రింపులు విన్న స్థానికులు హడలెత్తిపోతున్నారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులి కదలికలు పసిగట్టారు. పాదముద్రల ఆధారంగా గోదావరి పరివాహక ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లుగా గుర్తించారు.
ఈ పెద్దపులి ఆదిలాబాద్ నుండి గోదావరి తీరం వెంట ములుగు జిల్లా వైపు వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఈ పులి రెండు రోజులపాటు ఆలుబాక, బోధపురం గ్రామ పరిసర ప్రాంతాల్లోనే తిష్ట వేసింది. మరుసటి రోజు గోదావరి దాటిన పెద్దపులి ములుగు జిల్లాలోని మంగపేట చుంచుపల్లి మీదుగా మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహ స్వామి గుట్ట వైపు వెళ్లినట్లు పాదముద్రల ఆధారంగా అటవీ అధికారులు గుర్తించారు. పాదముద్రల ఆధారంగా పులి ఏ గమ్యం వైపు వెళ్తుందో గుర్తించిన అటవీశాఖ అధికారులు పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు
మంగపేట, తాడ్వాయి అడవుల్లో సంచరిస్తున్న పులి ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక అడవుల్లోకి ప్రవేశించినట్లుగా గుర్తించారు. ఏ క్షణమైనా పులిదాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు పరివాహక ప్రాంత అడవుల్లోకి వెళ్ళవద్దని, ఒంటరిగా అడవుల్లో సంచరించవద్దని సూచించారు. ముఖ్యంగా పశువులను సమీప అడవుల్లో మేతకు తీసుకెళ్లలేదని అటవీశాఖ అధికారులు సూచించారు.
ప్రస్తుతం సంచరిస్తున్న పులి మగపులిగా గుర్తించారు.. ఆడ పులి జడ కోసం గాలిస్తున్నట్లుగా భావిస్తున్నారు.. ఇలాంటి సమయంలో ప్రజల కవ్వింపు పాల్పడితే పులి దాడి చేసే అవకాశం ఉందని సూచిస్తున్నారు.. ప్రజలకు పులి కనబడితే తప్పించుకునే ప్రయత్నం చేయాలి కానీ ఆ పులికి హానికైనా తలపెట్టవద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
వీడియో చూడండి..
పులి సంచారం భయంతో దాదాపు 18 గ్రామాలు హడలెత్తిపోతున్నాయి. వెంకటాపురం మండలం నుండి ఆ పులి మంగపేట, తాడ్వాయి మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించదని తెలియగానే ఈ గ్రామాల ప్రజలు కాస్త ఊపిరి పిలుచుకున్నారు. కానీ తిరిగి మళ్లీ ఇటు కొత్తగూడ, గంగారం అడవుల్లోకి వచ్చే అవకాశం ఉండడంతో పరిసర గ్రామ ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు పులి కదలికలను పరిశీలించేందుకు ట్రాప్ కెమెరాలు అమర్చారు.
అయితే పులి పాదముద్రలు ఆధారంగా అది బెంగాల్ టైగర్‌గా భావిస్తున్నారు. సహజంగా గత ఏడాది కూడా ఇదే సమయంలో పులి ఈ ప్రాంతంలో సంచరించినట్లుగా గుర్తించారు. ముఖ్యంగా నీటి లభ్యత ఉన్న ప్రాంతంలో పులి సంచరిస్తుందని, ఆడ పులి జాడ కోసం ఈ పులి గాండ్రిస్తూ పరిసర ప్రాంతాల సంచరిస్తుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. గోదావరి నది తీరం వెంట వివిధ రకాల పంటలు సాగు చేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..