Tiger: వామ్మో పులొచ్చింది.. కాగజ్‌నగర్‌లో టెన్షన్ టెన్షన్.. ప్రజలు బయటకు రావొద్దంటూ చాటింపు..
పులిపేరు వింటేనే అమ్మో అంటాం. అడవుల్లో ఉండాల్సిన పులి ఊరిలోకి.. ఇంకా పట్టణంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మొన్నటివరు గ్రామీణ ప్రాంతాల్లో సంచరించిన పెద్దపులి.. ఏకంగా కాగజ్ నగర్‌లోకి ప్రవేశించింది.

Kagaznagar Tiger: పులిపేరు వింటేనే అమ్మో అంటాం. అడవుల్లో ఉండాల్సిన పులి ఊరిలోకి.. ఇంకా పట్టణంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మొన్నటివరు గ్రామీణ ప్రాంతాల్లో సంచరించిన పెద్దపులి.. ఏకంగా కాగజ్ నగర్‌లోకి ప్రవేశించింది. దీంతో కొమ్రంభీం జిల్లా కాగజ్‌నగర్‌వాసులు ఇప్పుడు పులి భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. తెల్లవార్లూ టెన్షన్‌తోనే గడిపారు. ప్రత్యేకించి పులిసంచరించినట్లు చెబుతున్న శ్రీరాంసాగర్, బాలాజీనగర్, కౌసర్ ప్రాంతవాసులైతే ఊపిరి బిగపట్టుకుని రాత్రంతా జాగారం చేశారు. ఏ క్షణాన ఎటు నుంచి పులిదాడి చేస్తుందోనన్న భయం గుప్పిట్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. పులిని బంధించేందుకు అధికారులు రంగంలోకి దిగినా.. ప్రజల్లోమాత్రం టెన్షన్ వీడడం లేదు. ఓవైపు పులిభయం.. ఇంకోవైపు ఎముకలు కొరికే చలితో కాగజ్‌నగర్‌వాసులు అల్లాడుతున్నారు. బయటకు రావాలంటేనే వణికిచస్తున్నారు. పులిని బంధిస్తామని అధికారులు హామీఇస్తున్నా.. ఎప్పుడేం జరుగుతుందోనని భయపడుతున్నారు. అధికారుల హెచ్చరికలతో ఇల్లు దాటేందుకే జంకుతున్నారు.
పెద్ద పులి రోడ్డు దాటుతుండగా స్థానికుల కంట పడింది. అయితే ఖానాపూర్ లో దాడి చేసిన పులీ ఇదీ ఒకటేనా అన్న వివరాలు ఆరా తీస్తున్నారు అటవీశాఖ అధికారులు. ఊళ్లో పులి తిరుగుతోందన్న వార్త గుప్పు మనడంతో.. కాగజ్ నగర్ వాసుల్లో గుండె దడ మొదలైంది. మరీ ముఖ్యంగా కాగజ్ నగర్ లో పులిసంచార ప్రాంతాలైన శ్రీరాంనగర్, బాలాజీ నగర్, కౌసర్ నగర్ ప్రాంతాల్లో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు. శివపురం రైల్వే గేటు దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. శివపురం గ్రామస్తులు ఎవరైనా ఇటు వైపు వచ్చేవారుంటే వారు తిరిగి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే పులి శివపురం గేటు దాటి పెద్ద వాగు గుండా.. అటవీ ప్రాంతంలోకి వెళ్లే అవకాశం ఉండటంతో.. అటవీశాఖ ఈ హెచ్చరికలను జారీ చేస్తోంది. బయటకు రావొద్దంటూ పోలీసులు మున్సిపల్ వాహనాల్లో తిరుగుతూ.. ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తున్నారు. ప్రత్యేకించి శివపురం గ్రామస్థులు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు.
పెద్ద పులి కాగజ్‌నగర్‌లోకి రావడం నిజమేనంటున్నారు ఫారెస్టు అధికారి దినేశ్ కుమార్. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. కాగజ్ నగర్, కోసిని, అక్సంపూర్‌లో ఉన్నది మ్యాన్ ఈటర్ కాకపోవచ్చన్నారు. పాదముద్రలు పరిశీలిస్తేనే అది ఏ పులి అన్నది తెలుస్తుందన్నారు. పులిని బంధించేందుకు కాగజ్ నగర్ ప్రజలు సహకరించాలని కోరారు. వీధి లైట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ బంద్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఏమాత్రం శబ్దం చేసినా పులి దిశమార్చుకునే అవకాశం ఉందన్నారు.




కాగజ్‌నగర్‌లో పెద్దపులికోసం అధికారులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. పులిని బంధించేందుకు ప్రత్యేక టీంలు రంగంలోకి దిగాయి. ఈ ఆపరేషన్‌లో అన్నిశాఖల అధికారులు భాగస్వామ్యం అయ్యారు. మున్సిపాలిటీ వాహనాలతో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
రెండ్రోజుల క్రితం ఖానాపూర్ సమీపంలో పెద్దపులి ఓ రైతుపై దాడి చేసి చంపింది. అదే పులి కాగజ్‌నగర్‌లో తిరుగుతుందా అంటూ స్థానికులు భయంతో చస్తున్నారు. భయంతో బిక్కుబిక్కుమంటూ గడపుతున్నారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ సిబ్బంది మ్యాన్ ఈటర్‌ను బంధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఖానాపూర్‌లో మ్యాన్ ఈటర్‌ని బంధించేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. పులిజాడ కోసం 35 ట్రాప్ కెమెరాలు, 50 మంది ట్రాకర్స్ ఏర్పాటు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
