Telangana: ఇంటి ముందు మాయమై.. కందకంలో శవమై.. బాలుడి మరణం మిస్టరీ..
నిర్మల్ జిల్లా భాగ్యనగర్ కాలనీలో మూడేళ్ల బాలుడి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. ఇంటిముందు ఆడుకుంటూ అదృశ్యమైన చిన్నారి… వారం రోజుల తర్వాత ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న మురికి కాలువలో మృతదేహంగా లభించడం కలకలం రేపింది. తొలినాళ్లలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడం, అదే ప్రదేశంలో శవం బయటపడటం అనేక అనుమానాలకు తావిస్తోంది.

మూడేళ్ల బాలుడు.. ముచ్చటగా ఎప్పట్లానే ఇంటిముందు ఆడుకుంటున్నాడు. ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. అంతే తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. గల్లీ గల్లీ గాలించారు.. తెలిసిన వారిని ఆరా తీశారు. కానీ ఆచూకి దొరకలేదు.. చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు.. అయినా లాభం లేకుండా పోయింది. నేరుగా రంగంలోకి దిగిన ఎస్పీ జానకీ షర్మిల బాలుడి అదృశ్యం కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టింది. మూడు ప్రత్యేక టీంలను రంగంలోకి దింపింది. సీన్ కట్ చేస్తే బాలుడు మిస్ అయిన వారం రోజులకు ఇంటికి కూత వేటు దూరంలోనే ఓ మురికి కాలువలో కందకంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. క్షేమంగా తిరిగి వస్తాడనుకున్న బాలుడు శవమై కనిపించడంతో కాలనీ ఒక్కసారిగా బోరుమంది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో చోటు చేసుకుంది.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రాంతానికి చెందిన అనిల్‌తో నిర్మల్ జిల్లా భాగ్యనగర్ కాలనీకి చెందిన చంద్రికతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు అశ్విన్, ఏడాది వయసున్న కుమార్తె ఉన్నారు. అప్పులు పెరిగి ఆర్థికంగా ఇబ్బందులకు గురవడంతో ఉపాధి నిమిత్తం నాలుగు నెలల క్రితం అత్తగారి ఊరైన నిర్మల్‌కు వచ్చిన అనిల్.. పట్టణంలోని ఓ కిరాణ దుకాణంలో పని చేసుకుంటూ భాగ్యనగర్ కాలనీలో అద్దెకుంటున్నారు. ఈనెల 10న రోజులాగే అనిల్ కుమారుడు మూడేళ్ల బాలుడు అశ్విన్ తన ఇంటి ముందు ఆడుకుంటుండగా ఇంటి పనుల్లో మునిగిపోయింది అనిల్ భార్య చంద్రిక.. అనిల్ కూడా దుకాణంలో పనికి వెళ్లాడు. ఇంతలోనే ఇంటి ముందు ఆడుకుంటున్న అశ్విన్ కనిపించకుండా పోయాడు. మద్యాహ్నం ఇంటి పనులు పూర్తి చేసుకుని కొడుకు కోసం వెతికిన తల్లి చంద్రికకు అశ్విన్ జాడ కనిపించలేదు. ఆందోళనకు గురైన చంద్రిక భర్త అనిల్‌కు సమాచారం చేరవేసింది. ఇంటికి చేరుకున్న అనిల్ స్థానికుల సాయంతో కాలనీ అంతా వెతికిన బాబు ఆచూకీ లభించలేదు. ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్వాడ్‌తో కాలనీ అంతా సెర్చ్ చేశారు. సమీప బావులు , కాలువలు, అనుమానస్పద ప్రాంతాలను జల్లెడ పట్టారు. ఎలాంటి క్లూ లభించకపోవడంతో నేరుగా రంగంలోకి దిగిన ఎస్పీ జానకీ షర్మిల బాబు ఆచూకీ కోసం రెండు ప్రత్యేక బృందాలను నియమించారు. మరో వైపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండటంతో భద్రతలో భాగంగా పోలీసు బృందాలను ఆ వైపు మానిటర్ చేయిస్తునే బాబు మిస్సింగ్ కేసు దర్యాప్తు కొనసాగించారు. కానీ ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. ఈ నెల 10 న మిస్ అయిన బాలుడు అశ్విన్.. ఇంటికి కూత వేటు దూరంలోని కందకంలో ఓ మురికి కాలువలో శవమై తేలాడు. ఈ సమాచారంతో కాలనీ షాక్‌కు గురైంది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటన స్థలాన్ని బ్లాక్ చేశారు. క్లూస్ టీంను రంగంలోకి దింపారు.
అయితే బాబు మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాబు మిస్సింగ్ రోజు ఈ కందకాన్ని గుర్తించి క్షుణ్ణంగా పరిశీలించిన ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. అదే రోజు మద్యాహ్నం వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం.. సీసీ కెమెరాలు పని చేయకపోవడం.. మిస్సింగ్ అయిన రోజున డాగ్ స్క్వాడ్ ఆ కందకం వైపు అసలు వెళ్లకపోవడం.. వారం తర్వాత కందకంలోని మురికి గుంటలో బాలుడి మృతదేహం బయటపడటం అనేక అనుమానాలకు కారణం అవుతుంది. ఒక వేళ ఈనెల 10 నే బాలుడి గుంతలో పడుంటే బాలుడి మృతదేహం ఎప్పుడో నీటిలో తేలేది. వారం రోజులు నీటిలోనే ఉండి ఉంటే బాలుడు శరీరం పూర్తిగా ఉబ్బిపోయి కుల్లిపోయి ఉండేది. అలాంటి ఆనవాళ్లు ఏం కనిపించకపోవడంతో ఎవరైనా కిడ్నాప్ చేసి చంపేసి ఈ కందకంలో పడేసి ఉంటారా.. లేక మరేదైనా కోణం ఉందా అన్నది తేలాల్సి ఉంది. మరో వైపు.. ఆదివారం అమావాస్య ఆ కోణంలోనే బాలుడిని కిడ్నాప్ చేసి ఉంటారని.. పోలీసుల నిఘా పెరగడంతోనే బాలుడిని కందకంలో పడేసి ఉంటారు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు పూర్తి వివరాలు వెళ్లడిస్తే తప్ప ఓ క్లారిటి వచ్చేది కష్టమే. ప్రస్తుతానికి బాలుడి మృతి మిస్సింగ్ మిస్టరినే.
