Nalgonda: టైర్ పేలి గింగిరాలు కొట్టిన టీచర్స్ ప్రయాణిస్తున్న కారు.. ఇద్దరు దుర్మరణం.. మరో..
ముచ్చటైన మూడు రోజుల సంక్రాంతి పండుగను వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకున్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత తొలి రోజు పాఠశాలలకు ఐదుగురు టీచర్లు కలిసి వెళ్తున్నారు. రోడ్డు ప్రమాదం రూపంలో ఇద్దరిని మృత్యువు కబళించింది. పూర్తి వివరాలు కథనం లోపల ...

పండుగ సెలవులు ముగిసిన వేళ నల్లగొండలో తీవ్ర విషాదం నెలకుంది. రోడ్డు ప్రమాదం ఇద్దరు టీచర్లను కబళించింది. వివరాల్లోకి వెళ్తే.. తుంగతుర్తి జిహెచ్ఎంగా ప్రవీణ్, రావులపల్లి జిహెచ్ఎంగా గీత, అన్నారం జిహెచ్ఎంగా సునీతరాణి, తుంగతుర్తి కస్తూర్బా గాంధీ ఏఎస్ఓగా కల్పన పనిచేస్తున్నారు. వీరితోపాటు మరో టీచర్ కూడా అదే ప్రాంతంలో పనిచేస్తున్నాడు. టీచర్స్ అంతా ఆ సమీప ప్రాంతాల్లో పనిచేస్తూ ఉండటంతో మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. వీరంతా నల్లగొండ నుంచి ప్రతిరోజు కారులో పాఠశాలలకు వెళ్లి వస్తుంటారు. వారం రోజులపాటు సంక్రాంతి సెలవులను ఎంజాయ్ చేసి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకున్నారు.
సంక్రాంతి సెలవులు ముగిసి రీ ఓపెన్ అయిన పాఠశాలలకు తొలి రోజు హాజరయ్యేందుకు వీరంతా కారులో వెళ్తున్నారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం సమీపంలో టీచర్లు ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. కారు అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టింది. దీంతో అక్కడికక్కడే కల్పన అనే టీచర్ మృతి చెందింది. గాయపడిన నలుగురు టీచర్లను సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. ఇందులో గీత అనే టీచర్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా చనిపోయింది. నల్లగొండలో చనిపోయిన టీచర్లు కల్పన, గీతల ఇంటి వద్ద విషాద ఛాయలు అమ్ముకున్నాయి. సంతోషంగా స్కూల్‌కి వెళ్లిన తమవారు విగత జీవిగా రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంపై జాజిరెడ్డిగూడెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
