Nizamabad: తెలంగాణ వాళ్లు ఏమైనా తక్కువా ఏంటి.. పండక్కి వచ్చిన అల్లుడికి అదిరే ఫీస్ట్..
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త అల్లుడికి అత్తమామలు అరుదైన ఆతిథ్యం అందించారు. తొలిసారి పండుగకు ఇంటికి వచ్చిన అల్లుడికి ఏకంగా 180 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ..

నిజామాబాద్ జిల్లా వర్నిలో కొత్త అల్లుడికి 180 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేసి అదుర్స్ అనిపించారు అత్తమామలు. మొదటి సారి సంక్రాంతి పండగకు ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి వెరైటీ వంటకాలతో సర్‌ప్రైజ్ చేసారు. ఏకంగా 180 రకాల వంటకాలువడ్డించారు. ఇంటికి వచ్చిన అల్లుడు ఈ వంటకాలను చూసి మొదట ఆశ్చర్యానికి గురైనా.. తరువాత ఒక పట్టు పట్టాడు.
వర్ని మండల కేంద్రానికి చెందిన కాకినాడ రాంబాబు లక్ష్మీ దంపతులు గత నవంబర్‌లో తమ కూతురు నందినిని.. ఈస్ట్ గోదావరి జిల్లాలోని రామచంద్రపురంకు చెందిన సతీష్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వివాహం తర్వాత మొదటి పండుగ అయిన సంక్రాంతికి అల్లుడు వర్నికి రావడంతో అత్తమామలు వివిధ రకాల వంటకాలతో అల్లుడికి రుచికరమైన విందు ఏర్పాటు చేశారు. పెద్ద అరటి ఆకులో 180 రకాల ఐటమ్స్ పెట్టి అతని ముందు పెట్టారు. ఇన్ని రకాల వంటకాలను చూసి తాను ఎంతో ఆనందానికి గురి అయ్యానని సతీష్ తెలిపారు. ఈ మధురానుభూతిని తాను మరిచిపోలేనన్నారు. గత వారం రోజులుగా వివిధ రకాల వంటకాలను తయారు చేసినట్లు లక్ష్మీ రాంబాబు తెలిపారు. కొత్త అల్లుడికి కొత్త రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు.
సహజంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కొత్త అల్లుడికి ఈ రేంజ్ ఆతిథ్యం ఇస్తారు. ఈ ఆంధ్రా అల్లుడు గోదావరి ప్రాంతానికి చెందినవాడు కావడంతో.. అక్కడి పద్ధతికి తగినట్లు ఈ హెవీ ఫీస్ట్ ఏర్పాటు చేశారు.
వీడియో దిగువన చూడండి…
