Robbers Attack: కర్ణాటకలో దారుణం.. విరుచుకుపడిన దారిదోపిడీ దొంగలు.. తెలంగాణ వాసులపై ఇనుపరాడ్లతో దాడి..
Robbers Attack: అరకు ఘటన మరిచిపోకముందే మరో దారుణ ఘటన వెలుగు చూసింది. షిరిడీ సాయి దర్శనానికి వెళ్లిన వికారాబాద్ జిల్లాకు..
Robbers Attack: అరకు ఘటన మరిచిపోకముందే మరో దారుణ ఘటన వెలుగు చూసింది. షిరిడీ సాయి దర్శనానికి వెళ్లిన వికారాబాద్ జిల్లాకు చెందిన బృందంపై దొంగలు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపరిచి ఆపై అందినకాడికి దోచుకుపోయారు. ఈ ఘటన కర్ణాటకలోని వాసి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే.. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండవేల్కిచర్ల గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కె. రాములు, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పని చేస్తున్న ఉద్యోగి రమేష్‌కు చెందిన ఇరు కుటుంబ సభ్యులు తమ వాహనంలో షిరిడీకి వెళ్లారు. సాయిబాబా దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా, కర్ణాటకలోని వాసి పోలీస్ స్టేషన్ పరిధిలోని రహదారిపై దొంగలు రాళ్లు, ఇనుప రాడ్లు చేతపట్టకుని వారి కారును అడ్డగించారు.
అయితే, దొంగలను తప్పించబోయిన కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో రోడ్డు మరే వాహనం కూడా రాకపోవడంతో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. చిన్న పిల్లలు, మహిళలు అని కూడా చూడకుండా ఇనుప రాడ్లు, రాళ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. వారివద్ద నుంచి 8 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. బాధితులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితులను స్థానికి ఆస్పత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Also read:
Uppena first day collection: మెగా మేనల్లుడి రికార్డ్.. తొలిరోజు ‘ఉప్పెన’లా వచ్చిన కలెక్షన్స్
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ముందే తాండూరు టీఆర్‌ఎస్ ఫైటింగ్.. రసాభాసాగా మారిన సభ్యత్వ నమోదు కార్యక్రమం