జానారెడ్డిగారూ.. ఇవిగో మిషన్ భగీరథ నీళ్లు.. జానారెడ్డి ఇంటిలో జలజలా రాలుతున్న భగీరథ నల్లాను చూపించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
మిషన్ భగీరథ నీళ్లు ఎక్కడొస్తున్నయి..? మా సొంతూరిలో భగీరథ నీళ్లే రావడం లేదంటూ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి మీడియా ముందు..
మిషన్ భగీరథ నీళ్లు ఎక్కడొస్తున్నయి..? మా సొంతూరిలో భగీరథ నీళ్లే రావడం లేదంటూ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి మీడియా ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జానారెడ్డి ఇంటిలో నల్లా నుంచి జలాజలా రాలుతున్న మిషన్ భగీరథ నీళ్లను రాష్ట్ర పంచాతీయరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశాల మేరకు అధికారులు నల్లా విప్పి చూపించారు.
నల్లగొండ జిల్లా హాలియా మండలం అనుముల గ్రామంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఇంట్లో.. మిషన్ భగీరథ మంచినీరు నల్లాల ద్వారా వస్తున్నప్పటికీ, రావడం లేదని మీడియాకెక్కడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లోని తన నివాసంలో శనివారం నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్ లో మంత్రి మాట్లాడారు. అనుములు గ్రామానికి మిషన్ భగీరథ నీరే రావడం లేదని జానారెడ్డి అనడాన్ని ఆయన ఖండించారు.
గత రెండు రోజులుగా నేషనల్ హై వే పై గ్రిడ్ పైప్ లైన్ లో బ్రేక్ డౌన్ వచ్చిందని, ఆ రిపేర్లు జరుగుతున్నందున నీటిని ఇవ్వలేకపోయామన్నారు. ఆ పనులను కూడా నిన్ననే పునరుద్ధరించినట్లు మంత్రి తెలిపారు. అనుముల గ్రామంలో 4 ఓవర్ హెడ్ ట్యాంకులు, 25.4 కి.మీ. ఇంట్రాపైపులైన్ ఉందన్నారు. 3,734 మంది జనాభా గల అనుముల గ్రామంలో 1548 ఇండ్లు ఉన్నాయన్నారు. అన్ని ట్యాంకులకు, బల్క్ నీటి సరఫరా జరుగుతున్నదన్నారు. ఆ గ్రామంలోని అన్ని ఇండ్లకు మంచినీరు నల్లాల ద్వారా అందుతున్నదని చెప్పారు. ఒకటి రెండు రోజుల పాటు కేవలం బ్రేక్ డౌన్ వల్ల రాని నీటి సమాచారం పాపం జానారెడ్డికి తెలియనట్లుందన్నారు.
అయితే, ఆయన ఇంటికి, ఆ గ్రామానికి మిషన్ భగీరథ అధికారులు వెళ్ళి నీరు వస్తున్నట్లుగా నిర్ధారించిన వీడియోని సైతం మంత్రి మీడియాకు ప్రదర్శించారు. జానారెడ్డి రాజకీయం చేస్తున్నారా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా… అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు, బహుషా ఆయనకు తగిన సమాచారం లేకపోవడం వల్ల అలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
Read more: