MLA Purchasing Case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక మలుపు.. నందకుమార్ ను విచారించేందుకు ఈడీకి అనుమతి..
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నందకుమార్‌ను విచారించేందుకు ఈడీ చేసిన అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. ఒకరోజు విచారణకు ఈడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు పర్మిషన్...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నందకుమార్‌ను విచారించేందుకు ఈడీ చేసిన అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. ఒకరోజు విచారణకు ఈడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కోర్టు అనుమతితో ఎల్లుండి (సోమవారం) చంచల్ గూడ జైలులో నంద కుమార్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. అతని స్టేట్‌మెంట్ నమోదు చేయనున్నారు. కాగా.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రస్తుతం దూకుడు పెంచింది. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిని రెండు రోజులపాటు విచారించిన ఈడీ.. మాణిక్ చంద్ ప్రొడక్ట్స్ డైరెక్టర్ అభిషేక్ ఆవాలాను విచారణకు హాజరు కావాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
తాజాగా నందకుమార్ కోరెపై దృష్టి సారించింది ఈడీ. నందకుమార్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. అతనిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో నిందితుడు నందకుమార్‌ను విచారించి కీలక సమాచారం రాబట్టేందుకు అనుమతించాలని కోరారు. నందకుమార్ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు నలుగురు అధికారులతో కూడిన బృందాన్ని అనుమతించేలా చంచల్‌గూడ జైలు పర్యవేక్షణాధికారిని ఆదేశించాలన్నారు. కాగా.. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈడీకి అనుమతి ఇచ్చింది.
మరోవైపు.. ఎమ్మెల్యేలకు ఎర కేసు ప్రధాన నిందితుడు రామచంద్ర భారతిని బంజారాహిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. నకిలీ పాస్‌పోర్టు కేసులో ముందస్తు బెయిల్ కోసం గురువారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..