Telangana: మీరు ఎప్పుడైనా ఈ టోల్‌ప్లాజా గుండా వెళ్లారా..?.. అయితే మీ ఫాస్ట్ టాగ్‌లో మనీ ఖతం !
మీరు ఎప్పుడైనా మహబూబ్ నగర్ జిల్లా మున్ననూర్ టోల్‌ప్లాజావైపు వెళ్లారా..? ఐతే మీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఒకసారి చెక్ చేసుకోండి..! ఎందుకంటే..మీ అకౌంట్‌లో నిత్యం క్యాష్ ఖాళీ అవుతుంటది

మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మున్ననూరు వద్ద 165 నెంబర్ జాతీయ రహదారీపై ఉన్న టోల్ ప్లాజా గురించి మీరు తెలుసుకోవాలి. ప్రతి రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోజూ సుమారు 5 లక్షల రూపాయల వరకు టోల్ వసూలవుతూ ఉంటుంది. రోడ్డు నిర్మాణం పూర్తి కానప్పటికీ, పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేనప్పటికీ.. స్థానికులను కూడా వదిలి పెట్టకుండా ముక్కుపిండి టోల్ ఫీజు వసూలు చేస్తుంటారు ఇక్కడి సిబ్బంది. కొద్ది రోజులుగా ఈ టోల్ ప్లాజాలో మరో అక్రమ బాగోతం నడుస్తోంది. ఒక్కసారి ఈ టోల్ గేట్ దాటితే చాలు తరచుగా ఫాస్ట్ టాగ్ నుంచి డబ్బులు కట్ అవుతునే ఉన్నాయి. ఇలా దోపిడికి గురైన వాహనదారులు అనేక సార్లు మున్ననూరు టోల్ ప్లాజా సిబ్బందిని నిలదీశారు. ఆపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో టీవీ9ను ఆశ్రయించారు బాధితులు. ఈ బాగోతం ఆరాతీస్తుండగానే టీవీ9 ప్రతినిధికి చెందిన ఫాస్ట్ ట్యాగ్ నుంచి 3సార్లు వరుసగా డబ్బులు కట్ అయ్యాయి.
దీంతో సిబ్బందిని ప్రశ్నించేందుకు టోల్ ప్లాజా దగ్గరు వెళ్లారు టీవీ 9 సిబ్బంది. అప్పటికే పెద్ద సంఖ్యలో జనం టోల్ ప్లాజా సిబ్బందిని ఇదే విషయమై నిలదీస్తూ కనిపించారు. దీంతో టోల్ ప్లాజా దోపిడీపై వరుస కథనాలను ప్రసారం చేసింది. దీంతో అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకొని తాత్కాలికంగా టోల్ వసూళ్లను నిలిపివేశారు. సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేసేంత వరకు టోల్ వసూలు చెయ్యబోమని అధికారులు ప్రకటించారు. అక్కడితో ఈ గొడవ ముగిసిందనే అనుకున్నారు. కానీ తర్వాత కూడా నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, కర్నూలు ప్రాంతాల్లో ఉన్న వాహనదారుల ఫాస్టాగ్ ఖాతాల్లో డబ్బులు కట్ అవడం మొదలయ్యింది. దీంతో మరోసారి గందర గోళ పరిస్థితి ఏర్పడింది. టోల్ ప్లాజా సిబ్బంది కావాలనే ఇలా చేస్తున్నారని.. గత 3 నెలల కాలంలో కోట్లాది రూపాయల దోపిడి జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మున్ననూరు టోల్ ప్లాజా విషయంలో తమకు ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమేనని, సిబ్బంది కావాలనే ఇలా చేసినట్టు రుజువైతే చర్యలు తప్పవని పోలీసులు అంటున్నారు. మున్ననూరు టోల్ ప్లాజా ఘటనతో ఇప్పుడు మిగిలిన టోల్ ప్లాజా వసూళ్ల విషయంలో కూడా వాహనదారుల్లో అనుమానాలు మొదలయ్యాయి.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
