Telangana: అయ్యో చిట్టి తల్లి!.. ఆడుకుంటూ వెళ్లి పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. సుత్తితో కొడుతూ..

ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఆహార కల్తీ ఘటనలు కలకలం స్పష్టిస్తుంటే, పాఠశాల భవనాలు, పరిసరాలు ప్రభుత్వానికి మరో సమస్యను తెచ్చిపెడుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినికి పెను ప్రమాదమే తప్పింది.

Follow us
Boorugu Shiva Kumar

| Edited By: Velpula Bharath Rao

Updated on: Dec 06, 2024 | 9:30 PM

అచ్చంపేట మండలం పులిజాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న ఓ విద్యార్థిని… ఉపాధ్యాయులు, తోటి గ్రామస్తులను పరుగులు పెట్టించింది. పాఠశాలలోని రెండు పిల్లర్ల మధ్యలో విద్యార్థిని తల ఇరుక్కుపోయింది. మూడవ తరగతి చదువుతున్న బాలిక తోటి విద్యార్థినిలతో ఆడుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్లర్ల మధ్య తల ఇరుక్కుపోవడంతో విద్యార్థిని కేకలు వేసింది. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆఫీసు రూంలో ఉన్న ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లి విద్యార్థిని తలను బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే ఉపాధ్యాయులు చేసిన ప్రయత్నాలతో సాధ్యపడలేదు. దీంతో గ్రామస్థుల సహకారం కోరారు. గ్రామంలో ఇల్లు కడుతున్న మేస్త్రీలకు సమాచారం అందించారు. కొంతమంది కూలీలతో వచ్చి సుత్తి, సానేం ఉపయోగించి పిల్లర్లను చిన్న చిన్న ముక్కలుగా తొలగించారు. ఈ క్రమంలో విద్యార్థినికి ఎలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం కొద్ది సేపటికి బాలిక తలను క్షేమంగా బయటకు తీశారు.

ఇప్పటికే కొన్ని పాఠశాలలు, గురుకులాల్లో ఆహార కల్తీ ఘటనలతో ఉపాధ్యాయులు బిక్కు బిక్కుమంటున్నారు. తాజా ఘటన పులిజాల ఉపాధ్యాయులను ఒక్కసారిగా ఆందోళనకు గురిచేసింది. బాలికకు ఏ ప్రమాదం జరగకుండా పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తలను క్షేమంగా బయటకు తీయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక మరోసారి ఈ ఘటన పునరావృతం కాకుండా పిల్లర్ల వద్ద తాత్కాలికంగా చర్యలు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి