Telangana: బిడ్డ.. నువ్వు లేక నేను లేను.. కంటనీరు పెట్టిస్తున్న తండ్రి కూతుళ్ల బంధం..

కుమార్తె మృతిని తట్టుకోలేక తండ్రి గుండె ఆగిపోయింది. వనపర్తి జిల్లాల్లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. తన కూతురు ఇక తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయిందన్న బాధని తట్టుకోలేక ఆ తండ్రి గుండె ఆగిపోయింది.

Telangana: బిడ్డ.. నువ్వు లేక నేను లేను.. కంటనీరు పెట్టిస్తున్న తండ్రి కూతుళ్ల బంధం..
Father Died After Daughter Died In Wanaparthy District
Follow us
Boorugu Shiva Kumar

| Edited By: Velpula Bharath Rao

Updated on: Dec 06, 2024 | 8:22 PM

కూతురంటే ఆ తండ్రికి ప్రాణం.. కుమార్తెకు తండ్రి అంటే ఎనలేని ప్రేమ. కుమార్తెకు చిన్న దెబ్బ తగిలిన తండ్రి తల్లడిల్లిపోతాడు. అలాంటిది చిన్నప్పటి నుంచి భుజాలపై మోసి గుండెలపై అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. తండ్రీ, కూతురి మమతానురాగాలను కాలం ఎక్కవ రోజులు చూడలేకపోయింది. కుమార్తె అనారోగ్యంతో మృతి చెందడంతో తండ్రి గుండె అల్లాడిపోయింది. కుమార్తె మృతదేహంపై పడి రోదిస్తూ తండ్రి హఠాన్మరణం చెందాడు. ఈ విషాద ఘటన వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండల కేంద్రంలో జరిగింది.

తన కూతురు ఇక తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయిందన్న బాధని తట్టుకోలేక ఆ తండ్రి గుండె ఆగిపోయింది. ఖిల్లాఘణపురం మండల కేంద్రానికి చెందిన దేవరశెట్టి శ్రీనివాసులు దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు సంతానం. శ్రీనివాసులు హైదారాబాద్‌లో కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే గత కొన్నేళ్ల నుంచి కూతురు దేవరశెట్టి వైశాలి (17) అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స తీసుకుంటున్నప్పటికి ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. గురువారం తెల్లవారుజామున ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె చనిపోవడంతో కన్న తండ్రి గుండె తట్టుకోలేకపోయింది. హృదయం కరిగిపోయేలా దుఃఖ సాగరంలో మునిగిపోయాడు. కుమార్తె మృత దేహంపై తలపెట్టి రోదిస్తున్న క్రమంలో తండ్రి శ్రీనివాసులు గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. మరణంలోనూ తండ్రీ, కూతురు ప్రేమ బంధం విడవలేదు. ఇక గంటల వ్యవధిలోనే తండ్రీ, కుమార్తె చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. తండ్రి శ్రీనివాసులు చిన్నప్పటి నుంచి కూతురును ఎంతో అల్లారుముద్దుగా చూసుకున్నాడని బంధువులు తెలిపారు. కూతురు అనారోగ్యానికి గురికావడంతో శ్రీనివాసులు మనోవేదన అనుభవిస్తున్నాడని చెప్పారు. ఇక తండ్రి, కూతురు మరణవార్తతో ఖిల్లాఘణపురం మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి, కూతురు ఎనలేని ప్రేమ బంధానికి స్థానికులను కన్నీరు పెట్టించాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి