Medak: అర్ధరాత్రి అమ్మకు ఎంత కష్టం! పురిటి నొప్పులతో ఆస్పత్రికి వస్తే తాళం.. కారు చీకట్లో కటిక నేలపైనే..
ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవానికి నోచుకోవడం లేదు. పురిటి నొప్పులతో అర్ధరాత్రి ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఓ ఆడ పడుచుకు కనీసం కాన్పు చేసే దిక్కులేకపోయింది. ఆస్పత్రికి తాళం వేసి ఉండటంతో కారు చీకట్లో కటిక నేలపై వరండాలోనే మహిళ ప్రసవ వేదన పడింది. చివరకు ఆ తల్లి వరండాలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ హృదయవిదారక ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తిలో..

మెదక్, మార్చి 12: ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవానికి నోచుకోవడం లేదు. పురిటి నొప్పులతో అర్ధరాత్రి ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఓ ఆడ పడుచుకు కనీసం కాన్పు చేసే దిక్కులేకపోయింది. ఆస్పత్రికి తాళం వేసి ఉండటంతో కారు చీకట్లో కటిక నేలపై వరండాలోనే మహిళ ప్రసవ వేదన పడింది. చివరకు ఆ తల్లి వరండాలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ హృదయవిదారక ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తిలో ఆదివారం (మార్చి 10) చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన తాటి సృజనకు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు సృజనను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. డ్యూటీలో ఉండాల్సిన వైద్య సిబ్బంది అందుబాటులో లేరు. పైగా ఆస్పత్రికి తాళం వేసి ఉంది. దీంతో ప్రసవ వేదన పడుతోన్న సృజన వరండాలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మరుసటి రోజు తెల్లారి (సోమవారం) కూడా డాక్టర్లు మధ్యాహ్నం మూడు గంటల వరకు రాలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి డాక్టర్ చందు నాయక్‌ను వివరణ కోరగా.. రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న సిస్టర్ జయంతికి మెమో ఇచ్చామని తెలిపారు. విధులకు గైర్హాజరైన వైద్యుడిపైనా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
కర్నూలులో సెబ్ వాహనాన్ని ఢీకొట్టిన మద్యం మాఫియా.. రూ.2 లక్షలు విలువ చేసే 40 బాక్సులు సీజ్
అక్రమ మద్యం రవాణాను అడ్డుకోబోయిన సెబ్ అధికారుల వాహనాన్ని ఢీకొట్టిన ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో ఆదివారం చోటు చేసుకుంది. సెబ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వినోద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదోని మండలం కడితోట గ్రామ సమీపంలో స్పెషల్‌ఫోర్స్ సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. కర్ణాటక వైపు నుంచి వస్తున్న కారు ఒకటి ఆగకుండా ప్రభుత్వ వాహనాన్ని ఢీకొట్టి మరీ దూసుకుపోయింది. అనుమానంతో ఆ వాహనాన్ని వెంబడించిన అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. కారును తనిఖీ చేయగా రూ.2 లక్షలు విలువ చేసే 40 బాక్సుల్లో 3,840 టెట్రా ప్యాకెట్లు గుర్తించారు. ఇదంతా కర్ణాటక మద్యంగా గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరేకల్లుకు చెందిన నర్సయ్య, కర్ణాటక రాష్ట్రానికి చెందిన చిదానందను అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు వినోద్ కుమార్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




