Vehicle Registration: ఇకపై షోరూమ్స్‌లోనే వెహికల్ రిజిస్ట్రేషన్.. రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చేసింది.. ఎలా చేస్తారంటే..?
ఇక నుంచి వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ ఆఫీసులకు వెళ్లాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక నుంచి మీరు బండి కొన్న షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ విధానాన్ని జనవరి 24వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది.

కొత్తగా వాహనాలు కొనేవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై ఏదైనా వెహికల్ కొంటే బండి రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన అవసరం లేనే లేదు. ఇక నుంచి మీరు ఎక్కడైనా వెహికల్ కొన్నారో ఆ షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. దీని వల్ల ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ రోజూ తిరుగుతూ గంటల పాటు క్యూలైన్లలో నిల్చోవాల్సిన పని తప్పుతుంది. దీని వల్ల సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా ఆర్టీఓ ఆఫీసులకు కూడా రద్దీ తగ్గనుంది. జనవరి 24వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది.
షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్
ఇప్పటివరకు బండి కొనగానే తాత్కాలిక రిజిస్ట్రేషన్ షోరూమ్‌లో జరుగుతుంది. ఇక శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి బండి కాగితాలతో పాటు ఇతర వెరిఫికేషన్ డాక్యుమెంట్లతో అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. అధికారులు వెరిఫై చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అందిస్తారు. ఇక నుంచి బండి కొనగానే షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ జరగనుంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రవాణాశాఖ సిద్దం చేసింది. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా డీలర్లే షోరూమ్‌లో బండికి శాశ్వత రిజిస్ట్రేషన్ చేస్తారు. జనవరి 23వ తేదీన హైదరాబాద్‌లోని ఓ షోరూమ్‌లో హోండా ఎలివేట్ కారుకు రిజిస్ట్రేషన్ చేసి ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఇక జనవరి 24వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చారు. ఈ విధానం వల్ల వాహనదారులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా రిజిస్ట్రేషన్లలో పారదర్శకత వస్తుందని రవాణాశాఖ చెబుతోంది. ఇక మధ్యవర్తుల ప్రమేయం కూడా తగ్గుతుందని భావిస్తోంది.
ఎలా చేస్తారంటే..?
-వాహనం కొనగానే డీలర్ మీ పేరుపై ఆన్‌లైన్ అప్లికేషన్ పెడతారు -బిల్లుతో పాటు ఇన్యూరెన్స్, అడ్రస్ ప్రూఫ్, వెహికల్ ఫొటోలను అప్ లోడ్ చేస్తారు -రవాణా శాఖ అధికారులు పరిశీలించి రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయిస్తారు -ఆ తర్వాత కొన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ కార్డ్(RC) స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికి అందుతుంది
